జననేత జగనే సమర్థుడు

తెనాలి: రాష్ట్ర ప్రజలు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కోరుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. ఆ పథకాల అమలు కేవలం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మేరుగ నాగార్జున విజయవాడలోని గుణదలకు తలపెట్టిన పాదయాత్రను రాజశేఖర్ ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం కూచిపూడిలో మంగళవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు, తాగు నీరు లేక, విద్యుత్ సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు కనీసం ప్రశ్నించే స్థితిలో లేరన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సమర్థ పాలన అందించే సామర్థ్యం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ఆయన విడుదల కోరుతూ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
జగన్ నాయకత్వాన్ని జనం కోరుతున్నారు..: ఆర్కే
కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని కోరుతూ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. కోర్టులో జగన్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కృష్ణా జిల్లా నాయకుడు, గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రజల మనిషని, ఆయన త్వరగా విడుదల కావాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు. యాత్ర చేపట్టిన పార్టీ నేత డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోరి నిరంతరం ప్రజల మనిషిగా ఉన్న జగన్ నిర్దోషిగా బయటకు వచ్చే రోజలు త్వరలోనే ఉన్నాయని చెప్పారు. ఆయన విడుదల కోరుతూ తన ఇష్ట దైవం ఏసుక్రీస్తు, మరియమ్మ తల్లిని ప్రార్థించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
జిల్లా పార్టీ మహిళా కన్వీనర్ దాది వెంకట లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ఎన్ని దుష్టశక్తులు అడ్డుపడినా జగన్ విడుదల ఖాయమన్నారు. కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు కోన రఘుపతి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రావి రవీంద్రనాథ్, గుదిబండి వెంకటరెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, తెనాలి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దొడ్డక సీతామహాలక్ష్మి, పొన్నూరు నియోజకవర్గ నేత మారుపూడి లీలాధరరావు, పిడుగురాళ్ల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, గుదిబండి చిన వెంకటరెడ్డి, రేపల్లె నాయకులు లోయ తాండవకృష్ణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డి.రేవతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గాదె శివరామకృష్ణారెడ్డి, అమృతలూరు మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర పాల్గొన్నారు.
బాబు మాటలను ప్రజలు నమ్మరు
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు చౌకబారు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడు కొత్తగా మీ కోసం వస్తున్నా.. అంటూ పాదయాత్ర పేరుతో సరికొత్త డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారం అనుభవించారని, ఆయన హయాంలో రైతులు, వ్యాపారులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేయడానికి చంద్రబాబు చేపట్టిన విధానాలే కారణమని ధ్వజమెత్తారు. మళ్లీ నేను మారాను... మీ కోసం వస్తున్నాను... మీకు బాసటగా ఉంటాను.. అంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని, వీటిని నమ్మేస్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని తెలిపారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వర్షాకాలం, చలికాలంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే రోజుల్లో మీ కోసం.. అంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి అధికారం రావడం అనేది ఇక ఎప్పటికీ కలేనని స్పష్టంచేశారు.

Back to Top