ముదిగొండ:
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ముదిగొండలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కార్యకర్తల్లో పోటీతత్వం ఉన్నప్పుడే పార్టీ ముందుకు వెళుతుందన్నారు. పార్టీ కార్యకర్తలంతా సైనికుల మాదిరిగా పనిచేయాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని, గడప గడపకు వెళ్లి.. వైయస్‌ఆర్ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. జగన్ స్ఫూర్తితో షర్మిల సాగిస్తున్న పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందనీ, రాష్ర్టంలో ప్రథమ స్థానం దిశగా పార్టీ దూసుకెళుతోందనీ చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేయాలని కోరారు. ఇప్పటివరకు జిల్లాలో 12వేల క్రియాశీల సభ్యత్వం చేర్పించినట్టు చెప్పారు. మరో 40వేల సభ్యత్వం చేర్పించనున్నట్టు తెలిపారు. వైయస్‌ఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లేపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 37 కుటుంబాల వారు ఎంపీటీసీ మాజీ సభ్యుడు గునగంటి సాయిల్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు.