జగన్‌పై కేసు రాజకీయ ప్రేరేపితమని రుజువు

హైదరాబాద్, 26 ఏప్రిల్ 2013:

సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ సుప్రీం కోర్టులో శుక్రవారం దాఖలు చేసిన అఫిడవిట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని శాసిస్తోందన్న తమ ఆరోపణకు ప్రబల తార్కాణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసును కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయనకు బెయిలు రాకుండా అడ్డుకుంటున్న విషయం ఈ సంఘటనతో నిరూపణైందని ఆయన పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై కేసు రాజకీయ ప్రేరేపితమైనదని తాము మొదటినుంచి చెబుతూనే ఉన్నామన్నారు.

కొణతాల మీడియా సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి..

స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ  పక్షపాతంగా వ్యవహరిస్తోందని మరోసారి రుజువైందని కొణతాల రామకృష్ణ వెల్లడించారు.  బొగ్గు కుంభకోణంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేయాల్సిన అఫిడవిట్‌లోని అంశాలను న్యాయ  శాఖ మంత్రితో చర్చించినట్లు సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ అంగీకరించడమే దీనికి తిరుగులేని ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని రెండేళ్ళుగా 2జి, బొగ్గు కుంభకోణాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిపై సీఏజీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందని కొణతాల చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ మినహా ప్రతి పార్టీ సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి చేకూర్చాలని డిమాండు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. తద్వారా సంస్థ పనితీరుపై ప్రభుత్వ ప్రభావం  పడకుండా చూసేందుకు వీలవుతుందన్నారు. ఈ డిమాండులో న్యాయం ఉందని సీబీఐ డైరెక్టర్ ప్రకటన సూచిస్తోందని చెప్పారు. న్యాయశాఖమంత్రికీ, పీఎంఓలోని ఓ జాయింట్ సెక్రటరీకీ నివేదికను చూపించిన తర్వాతే కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపారన్నారు. ఒక కేసు విషయంలోనే ఇలాంటి పరిస్థితుంటే.. సుప్రీం కోర్టు పర్యవేక్షణ లేని ఇతర కేసుల గతేంటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలు ఎంతగా దుర్వినియోగమవుతున్నాయో మరోసారి స్పష్టంగా రుజువైందన్నారు.

సీబీఐ చేపట్టే దర్యాప్తు అంశాలను ఏ ప్రభుత్వ శాఖకు కానీ, అధికారికి కానీ, మంత్రికి కానీ చూపించాల్సిన అవసరం లేదన్నారు. చూపించకూడదు కూడానని చెప్పారు. పరిపాలన సంబంధమైన అంశాలకు సంబంధించి, ఆయా శాఖలకు వెళ్ళాలి తప్ప నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి వివరించాల్సిన అవసరం లేదని కొణతాల స్పష్టంచేశారు. కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం సీబీఐని ఏరకంగా ఉపయోగించుకుంటున్నాయో వివరించడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదన్నారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసు ఇదని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు పెట్టిందని తాము ముందునుంచి చెబుతూనే ఉన్నామన్నారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో లేని ఈ కేసులో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో వేరే చెప్పాల్సిన అవసరం లేదని కొణతాల పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిగారి మీద వేసిన ప్రతి కేసుకు సంబంధించి కేంద్రంలోని వ్యక్తుల పర్యవేక్షణలో తయారైనవేనని కూడా రుజువవుతోందన్నారు. ఇక్కడున్న అధికారులు పావులుగా మాత్రమే ఉపయోగపడుతున్నారన్నారు. సీబీఐ స్వతంత్రంగా పనిచేయడం లేదనడానికి ఇదో నిదర్శనమని స్పష్టంచేశారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని డీఎంకే ప్రకటించిన కొద్ది గంటల్లోనే కరుణానిధి కుమారుడు స్టాలిన్‌పై ఐదేళ్ళనాటి కేసును తిరగదోడి ఇ.డి. దాడులు చేస్తే.. స్వయంగా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని వెనక్కి రప్పించిన సంగతి మరో ఉదాహరణన్నారు. అన్నీ ప్రధాన మంత్రి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయనడానికి ఇదో నిదర్శనమని కొణతాల చెప్పారు. 2జి స్ర్పెక్ట్రం కేసులో సంబంధిత మంత్రి రాజా ప్రధానికి అన్నీ తెలిసే జరిగాయని అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ సీబీఐ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. ప్రభుత్వానికి ప్రత్యర్థులను ఏరకంగా దెబ్బకొట్టాలి.. తమ వారిని ఎలా రక్షించుకోవాలీ బాగా తెలుసన్నారు.


తెలుగు భాషపై మమకారం అధికారుల నియామకంలో లేదే!


తెలుగు భాష ప్రాధాన్యతపై గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నియామకం అంశంలో తెలుగు ఐఏయస్ అధికారులకు ప్రాధాన్యతనివ్వడం లేదని కొణతాల ఆరోపించారు. ఇతర రాష్ట్రాలవారినే దీనికి ఎక్కువగా ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన పక్క రాష్ట్రం ఒడిషాను చూసి ఇందులో ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలుగు భాషపై మక్కువ ఏమైంది ముఖ్యమంత్రిగారూ! అంటూ ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. సీనియర్ అయిన శామ్యూల్, ఐవైఆర్ కృష్ణారావులను పక్కన పెట్టి పీకే మొహంతిని ఎంపిక చేయడమేమిటని ఆయన నిలదీశారు.

Back to Top