జగనన్న వస్తారు.. ఆదుకుంటారు

మాచర్ల:

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నిటికీ తూట్లు పొడుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా కారంపూడి మండలంలోని పెదకొదమగుండ్లలోని పోలేరమ్మ దేవాలయం వద్ద రచ్చబండలో ఆమె మాట్లాడారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అమలవుతున్నాయని ఆమె ప్రజలను అడిగినపుడు నీళ్లు లేవు, కరెంటు లేదు, మాకు అన్ని బాధలు పెరిగాయని ప్రజల నుంచి సమాధానం వచ్చింది.

     శ్రీమతి షర్మిల మాట్లాడుతూ మహానేత జీవించి ఉంటే  రైతులకు తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చి ఉండేవారని చెప్పారు. ఆయన అధికారంలో ఉన్నపుడు కరెంటు, గ్యాస్, ఆర్టీసీ చార్జీలు, పన్నులు ఒక్కపైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. మీకు మంచి రోజులు వస్తాయి. నీళ్లు వస్తాయి.. దేవుడి ఆశీస్సులు ఉంటాయి.. విలువైన ప్రాణాలను, భూములను కోల్పోవద్దు.. ఆరు నెలల్లో జగనన్న సీఎం అవుతాడు.. అని ధైర్యం చెప్పారు.
      పలువురు తమ సమస్యలను శ్రీమతి షర్మిల ముందు ఏకరవు పెట్టారు. గోగులపాడు మంగమ్మ అనే మహిళ మాట్లాడుతూ తన మనవడి గుండెకు రంధ్రం పడిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందేందుకు వెళితే పట్టించుకోవటం లేదని మీరైనా న్యాయం చేయండంటూ రోదించింది. ఇందుకు చలించిన శ్రీమతి షర్మిల స్పందించి మహానేత రాజశేఖర్‌రెడ్డి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆర్కే ద్వారా నిమ్సులో చేర్చి వైద్యం చేయించే ప్రయత్నం చేస్తారన్నారు. గ్రామానికి చెందిన ఎంసీఏ విద్యార్థిని ధనలక్ష్మి మాట్లాడుతూ మా సమస్యలు తెలుసుకోవటానికి మీరు రావటం ఆనందంగా ఉందనీ.. మా గ్రామమంతా మీకే మద్దతు పలుకుతామనీ చెప్పింది. ఎమ్మెల్యే పీఆర్కే అంకుల్‌ను మళ్లీ గెలిపిస్తామని చెప్పటంతో సభికుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి.

     దారెడ్డి శివమ్మ మాట్లాడుతూ పావలా వడ్డీ అని చెప్పి రెండు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పింది. కడియం మరియమ్మ, నాగమ్మలు మాట్లాడుతూ ఇళ్లు లేవని, ఉపాధి పని లేదని, నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో షర్మిల వారి సమస్యలన్నిటినీ ఆలకించి జగనన్న త్వరలోనే బయటకు వస్తాడు, మీ అన్ని సమస్యలు తీరుస్తాడు అని ప్రకటించారు.

Back to Top