జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం : షర్మిల

వేంపల్లె, అక్టోబర్ 18, 2012 : జగనన్ననాయకత్వంతోనే రాజన్నరాజ్యం సాధ్యమని షర్మిల అన్నారు. జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారని కక్ష కట్టి కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై జగనన్నను జైలు పాలు చేశాయని ఆమె విమర్శించారు. గురువారం రాత్రి వేంపల్లె వద్ద జరిగిన భారీ బహిరంగసభను ఉద్దేశించి షర్మిల ఉత్తేజకరంగా ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే ఉండాలని అధికార, ప్రధానప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ఆమె ఆరోపించారు. జగనన్న ప్రజల్లో ఉంటే వారికి మనుగడ ఉండదని తలచిన ఈ రెండు పార్టీలు సిబిఐని వాడుకుని, చేతులు కలిపి బెయిలు కూడా రాకుండా కేసులలో ఇరికించే ప్రయత్నం చేశారని ఆమె దుయ్యబట్టారు. "ఈ అన్యాయాన్ని మీరు సహించరని నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని నా నమ్మకం" ఆమె ప్రజలను ఉద్దేశించి అన్నారు.
పార్టీలకు, కులాలకు, మతాలకూ అతీతంగా వైయస్‌ సంక్షేమ పథకాలను అందిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం రైతులు, విద్యార్థులు తదితర వర్గాలను క్షోభ పెడుతోందని ఆమె నిందించారు. రాష్ట్రం మున్నెన్నడూ ఎరుగనంతగా విద్యుత్తు సంక్షోభం ఉందని, ఇది కేవలం సమయానికి విద్యుత్తును కొనుగోలు చేయకపోవడం వల్లేననీ, కేవలం ముందుచూపు లేకపోవడం వల్ల కనీసం అవసరాలకూ దిక్కు లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టిడిపి గత మూడేళ్లుగా తన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తూ వచ్చిందని ఆమె విమర్శించారు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబు అధికారాన్ని లాక్కుని ప్రభుత్వంలోకి వచ్చారని ఆమె దుయ్యబట్టారు. అధికారంలోకి్ రావడానికి కారణమైన కిలో రెండ్రూపాయల బియ్యం, మద్యనిషేధం వాగ్దానాలను బాబు విస్మరించారని ఆమె గుర్తు చేశారు. "బాబుకు మాట ఇవ్వడమంటే ఏమిటో తెలియదు, మాట నిలుపుకోవడం అంతకన్నా తెలియదు" అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయం దండగంటూ బాబు నాడు రైతులను అవమానించారనీ, ఎనిమిదేళ్లలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారనీ, విద్యుత్తు బకాయిలు కట్టాలంటూ కేసులు కూడా పెట్టారనీ, ఫలితంగా అవమానభారంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారనీ ఆమె అన్నారు.
ఏకంగా ముప్పైఏళ్లు సేవలందించిన వైయస్ఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బహుమతి ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టి దోషిగా నిలబెట్టడమని ఆమె నిరసించారు. తాను ప్రారంభించిన ప్రతి పథకానికీ ఇందిరమ్మ అనో రాజీవ్‌ అనో పేరు పెడుతూ వచ్చిన రాజశేఖర్‌ రెడ్డిని జనం మనసుల్లోంచి చెరిపేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆమె కాంగ్రెస్‌కు ఆ మాత్రం కృతజ్ఞత లేకపోవడాన్ని నిందించారు. వైయస్‌ మరణానంతరం ఆరువందల మంది వరకూ అభిమానులు చనిపోగా వారి కుటుంబాల పట్ల బాధ్యతను కాంగ్రెస్ విస్మరించిందని షర్మిల తప్పుబట్టారు. ఒక్క జగనన్న మాత్రమే మహానేత కొడుకుగా ఓదార్చే బాధ్యత తీసుకున్నారనీ, అందుకే కక్ష గట్టి ఎన్నో విధాలుగా హింసిస్తున్నారనీ ఆమె విమర్శించారు.
కాంగ్రెస్, టిడిపిల కుట్ర రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. అశేషంగా పాదయాత్రకు హాజరైన జన సమూహాన్ని ఉద్దేశించి మీ అభిమానానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నానని, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాననీ ఆమె అభివాదం చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె అన్నారు.
మొదట ఇడుపులపాయ నుండి వీరన్నగట్టు పల్లెకు షర్మిల 4.5 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత మరో 1.5 కి.మీ.లు నడచి కుమ్మరాం పల్లె చేరుకున్నారు. అక్కడి నుండి వేంపల్లెకు 5 కి.మీలు పాదయాత్ర సాగింది. స్థానిక నేతలు వేంపల్లెలో షర్మిలకు రైతు కిరీటంగా ఆకుపచ్చతలపాగా బహూకరించారు. వైయస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలిరోజు షర్మిల ముందుగానే రూపొందించిన షడ్యూలు ప్రకారం 13 కి.మీ.లు నడిచారు.

Back to Top