కోర్ కమిటీ కాదు..చోర్ కమిటీ

హైదరాబాద్ 12 జూలై 2013:

తెలంగాణ ప్రజల మనోభావాలను ఎలా అపహాస్యం చేస్తున్నదీ, రాష్ట్రంలో గెలిచిన 30 మంది ఎంపీలను జోకర్లుగా చూసి, ప్రజలను మోసగిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.  పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి సారి  కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తెలంగాణ అంశంలో ఆపార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఈ సారి తేల్చేస్తామని చెప్పిన నేతలు తేల్చిదేమీ లేదన్నారు. కిరణ్, బొత్స, దామోదర రోడ్ మ్యాప్ లను కోర్ కమిటీ పరిశీలించిందనీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చాల్సి ఉందని దిగ్విజయ్ సాదాసీదాగా చెప్పి నిష్క్రమించారని తెలిపారు. ఇవన్నీ ఊహించినవేనని చెప్పారు. వెయ్యి మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంతమందిని బలితీసుకోవాలనుకుంటోందని తీవ్రంగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలవారినీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తెలంగాణ సమస్యను తేలుస్తుందన్న ఆశ ఏ ఒక్కకిలో లేదన్నారు. ఉత్కంఠభరిత పరిస్థితిని కాంగ్రెస్ పార్టీయే సృష్టించిందనీ, తెలంగాణా అంశం చివరి దశలో ఉందనీ, తేల్చేస్తున్నారనే వాతావరణాన్ని కూడా రూపొందించిందన్నారు. గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ,  ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటన, తదుపరి చిదంబరం ప్రకటన లేదా.. షిండే హయాంలో చర్చలు, తదితర అంకాలు ఇప్పటివరకూ సాగాయన్నారు. ఇప్పుడు రోడ్ మ్యాపుల నాటకమాడుతోందని వారు ధ్వజమెత్తారు.

తెలంగాణ సమస్య రగలడానికి కాంగ్రెస్ కారణం కాగా.. దానిని ఉసిగొల్పింది టీడీపీ అని ఆరోపించారు.  ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఏం జరుగుతుందో ముందే తెలుసు కాబట్టే టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరూ దీనిపై మాట్లాడలేదన్నారు. తెలంగాణపై తేల్చేది లేదు.. పాడు లేదు.. మీరు మాట్లాడకండని చంద్రబాబునాయుడు వారికి చెప్పి ఉంటాడన్నారు. ఈ సమావేశానికి చిదంబరం కూడా హాజరు కాని విషయం గమనార్హమన్నారు. తెలంగాణ విషయాన్ని తేలుస్తుందా, నానుస్తుందా చిదంబరానికి, టీడీపీకీ, కాంగ్రెస్ కూ తెలుసనీ వారిద్దరూ పక్కా తోడుదొంగలనీ వారు తెలిపారు. కోర్ కమిటీ కాదు చోర్ కమిటీ అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కమిటీకి ఏమాత్రం విలువలేదన్నారు. తెలంగాణపై చర్చలతో అది అభాసుపాలైందన్నారు.

ఇది కాంగ్రెస్ డ్రామా: గట్టు

కాంగ్రెస్ కుట్ర బయట పడిందని గట్టు రామచంద్రరావు స్పష్టంచేశారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆ పార్టీ డ్రామా ఆడుతోందని తమ పార్టీ ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. అదిప్పుడు రుజువైందన్నారు. కోర్ కమిటీ బోర్ కమిటీగా మారి ఇప్పుడు చోర్ కమిటీగా మిగిలిందన్నారు. ఈ కమిటీ అబద్ధాలాడడమే కాక, మోసం కూడా చేసిందని తెలిపారు. మూడు ప్రాంతాల ప్రజలకు సమాధానం చెప్పి ఆ పార్టీ ముక్కు నేలకు రాయాల్సిన అవసరముందన్నారు. ప్రజలను రెచ్చగొట్టి, వైషమ్యాలను పెంచి పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. దిగ్విజయ్ ప్రజల్ని మరో సారి మోసం చేశారన్నారు. తెలంగాణా ఇచ్చినట్లు ఇక్కడ స్వీట్లు పంచి, ఢిల్లీలో ఫీట్లు చేసి, సమైక్యాంధ్రలో పోరాటం చేయమని చెప్పి, రాయలసీమను చీలుస్తామని చెప్పి మూడు ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం తప్ప మరేమీ కాదన్నారు. ఇది రాజకీయ కుట్ర తప్ప ప్రజలమీద ప్రేమ కాదని స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రాబోయే సాధారణ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఇదన్నారు. నిజాం మైదానంలో పెద్ద సభ పెట్టుకుని చేతులుచేతులు కలిపి స్వీట్లు తిన్నవారు ఈరోజు ప్రజలలోకి ఎలా వెడతారని గట్టు ప్రశ్నించారు. ఈ మూడు ప్రాంతాల కాంగ్రెస్ నేతలకూ సిగ్గుంటే రాజీనామాలు చేసి రోడ్డుమీదకు రావాల్సిన అవసరముందన్నారు. మొత్తం ప్రపంచంలో తెలుగు ప్రజలను అవమానించే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొస్తోందన్నారు. తెలంగాణ వచ్చినట్లే.. సోనియమ్మ ఇచ్చినట్లే అంటూ తెలంగాణ మ్యాపులను చూపించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని చెప్పారు. మూడు ప్రాంతాల నాయకులు ఎవరూ మీడియా ముందుకు రాలేదన్నారు.

Back to Top