తాడేపల్లి: తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆక్షేపించారు. ఇకనైనా వారు వాస్తవాలు అంగీకరించకుండా, వైయస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయడం అత్యంత హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇకనైనా చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోవాలని, ముక్కు నేలకు రాసుకుని హిందువులకు, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కోన ర«ఘుపతి తేల్చి చెప్పారు. ప్రెస్ మీట్ లో కోన రఘుపతి ఇంకా ఏమన్నారంటే.. అధికారంలోకి రాగానే కల్తీ కుట్రకు బీజం: అధికారంలోకి వచ్చి పట్టుమని నాలుగు నెలలు కూడా కాకుండానే తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగం పేరుతో చంద్రబాబు రాజకీయ క్రీడ మొదలుపెట్టారు. ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా? ఏదైనా నివేదిక వచ్చిందా? దేని మీద ఓ ముఖ్యమంత్రి స్పందించాలన్నది కూడా చూసుకోకుండా చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో కలిసి తొలిసారి కుట్రలకు తెర లేపారు. అప్పటి నుంచీ లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏ భయం, భక్తీ లేకుండా శ్రీ వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారు. భక్తుల మనోభావాల్నీ పట్టించుకోలేదు. కేవలం జగన్‌గారిపై ప్రజలకు ఉన్న విశ్వసనీయత మీద దెబ్బ కొట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇదంతా చేశారు. వాస్తవాలు అంగీకరించకుండా ఎదురుదాడి: నిజంగానే భగవంతుడున్నాడని మరోమారు నిరూపితమైంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. దేశ సమున్నత న్యాయస్థానం స్పందించి, వారికి మొట్టికాయలు వేసినా కూడా వాళ్ల వైఖరి మారలేదు. తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన.. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) స్పష్టమైన నివేదికలు ఇవ్వడం, అదే విషయాన్ని కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చడంతో.. ఇన్నాళ్లూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ చేసిన ఆరోపణలు, విమర్శలు పచ్చి అబద్ధమని తేలింది. అయినా వాస్తవాలు అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నారు. సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌లో నెయ్యిలో జంతుకొవ్వు ఉందని ప్రస్తావించారని మళ్లీ అబద్ధాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా మరో అడుగు ముందుకేసి పచ్చి అబద్ధాలు, జగన్‌గారు, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలతో రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న మా పార్టీ నేతలపై దారుణంగా దాడి చేస్తున్నారు. నిన్న (శుక్రవారం) తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు. అదే రోజు సాయంత్రం మాజీ మంత్రి విడదల రజినిపై దాడి చేశారు. శనివారం ఉదయం, గుంటూరులోని గోరంట్ల వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. భక్తులకు బాబు, పవన్ క్షమాపణ చెప్పాలి: ఇకనైనా కూటమి ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, చివరకు దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగినందుకు, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పవిత్ర ప్రసాదమైన లడ్డూపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినందుకు వెంటనే ముక్కు నేలకు రాసుకుని శ్రీవారి భక్తులకు, హిందువులందరికీ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. అదే వారు చేసే ప్రాయశ్చితం అని కోన రఘుపతి స్పష్టం చేశారు.