అది దిగ్విజయ్ సంస్కారహీనత: మైసూరారెడ్డి

హైదరాబాద్ 21 ఆగస్టు 2013:

ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించాలని కోరుతూ అన్ని పార్టీలూ తీర్మానించి లేఖలు ఇచ్చాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ చెప్పిన విషయం అసత్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరా రెడ్డి తెలిపారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాత్రమే తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన తెలంగాణ సమస్యకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలని మాత్రమే తాము కోరినట్టు స్పష్టంచేశారు. మా పార్టీ ఆయనకు బ్లాంక్ చెక్ ఇవ్వలేదన్నారు. కనీసం ఆ అర్థం వచ్చేలా కూడా మాట్లాడలేదని చెప్పారు. దిగ్విజయ్ సింగ్  ఓ రాజకీయ పరిణతి ఉన్న సీనియర్ మ్యాన్ అని చెబుతూ... ఇటీవలి కాలంలో ఆయనకు మానసిక దౌర్బల్యం ఏర్పడి ఉంటుందనీ , అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనీ మైసూరా రెడ్డి మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ అనని మాటలను అన్నట్టుగా చెప్పడం సంస్కారహీనమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ విధానం మొదటినుంచి ఇతర పార్టీల మీద బురదజల్లడమేనని ఆరోపించారు. తెలంగాణపై ఆ పార్టీ ఎప్పుడూ తన విధానాన్ని కానీ నిర్ణయాన్ని గానీ ప్రకటించలేదన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామన్నారు. షిండేగారికి ఇచ్చిన లేఖలో తామెక్కడా రాష్ట్రాన్ని విభజించాలన్నట్లుగా బ్లాంక్ చెక్ ఇవ్వలేదని చెబుతూ ఆనాటి లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు.

Back to Top