తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసోకోవడంలోనూ, తుఫాను తీరం దాటిన తరువాత సహాయ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతిలు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కేవలం ప్రచారం కోసమే తప్ప క్షేత్ర స్థాయి పనుల పట్ల చిత్తశుద్ధి లేదని వారు ధ్వజమెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయాక వీరు ఒక సంయుక్త ప్రకటనలో ప్రభుత్వ నిర్లప్తతను ఎండగట్టారు. చంద్రబాబుగారు చేస్తున్న టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు అన్నీ కూడా పబ్లిసిటీ స్టంటులో భాగమేనని మరోసారి వెల్లడైంది. తుపాను బాధిత ప్రాంతాలనుంచి ఈరోజు రాత్రి 8 గంటలవరకూ సమాచారం మేరకు38 మండలాల్లోని 8 మండలాలు అతి తీవ్రంగానూ, మరికొన్ని తీవ్రంగానూ, ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, టెక్కలి, సంతబొమ్మాళి అతి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, పాలకొండ మండలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిగిలిన మండలాలపై తుపాను తీవ్రత కనిపించింది.ఉద్యానవన పంటలమీద ఆధారపడ్డ రైతులెవ్వరూ కూడా మరికొన్ని సంత్సరాలు పాటు కోలుకోని రీతిలో దెబ్బతిన్నారు. కొబ్బరి, జీడిమామిడి, మామిడి, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పూర్తిగా ధ్వంసమైపోయింది. తిత్లీ తుపాను తీరందాటిన సమయం అక్టోబరు 11న ఉ 4.గం.లకు తీరందాటితే, దాని తీవ్రత ఉదయం ఉ. 8 గంటల వరకూ ఉంది. కాని, ఆతర్వాత ఎక్కడా కూడా సహాయ కార్యక్రమాలు జరగలేదు. రాత్రి 9 గంటలవరకూ కూడా జాతీయరహదారిపై పడ్డ చెట్లను తొలగించలేకపోయారు. తుపాను తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ముఖ్యమంత్రి ఎవరితో టెలీకాన్ఫరెన్స్‌లు చేశారో అర్థంకావడంలేదు. తుపాను తాకిడి ఉన్న మండలాల్లో ఎక్కడా కూడా ముందస్తు చర్యల్లేవు.కవిటి, సోంపేట, మందస, కంచిలి, వజ్రపు కొత్తూరు తదితర మండలాల్లోని గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మంచినీళ్లు, పాలు, ఆహారం ఎక్కడా సిద్ధంచేయలేదు. జిల్లా మొత్తమ్మీద కేవలం రెండే రెండు సహాయక బృందాలు మాత్రమే పనిచేశాయి. ఒకటి టెక్కలి ప్రాంతంలోనూ, మరొకటి శ్రీకాకుళంలోనూ ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరంలేదు. మరి చంద్రబాబుగారు ఏం సమీక్షచేసినట్టు? అధికారయంత్రాంగాన్ని ం సమాయత్తంచేసినట్టు? తుపాను బాధిత ప్రాంతాల్లో రవాణా సాగాలంటే కనీసం 20–30 బృందాలు అవసరమని తెలుస్తోంది. అన్నికంటే ఘోరం ఏంటంటే.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీరోగుల ప్రాణాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడుతున్నారు. కిడ్నీరోగులకు డయాలసిస్ చేసే సోంపేట ఆస్పత్రిలో కరెంటు లేదు.కరెంటు లేక అక్కడ ఆర్వోప్లాంటు పనిచేయడంలేదు. 72 గంటలకు ఒకసారి డయాలసిస్ చేసుకోవాల్సిన రోగులు చాలామంది ఉన్నారు, వీరంతా చావుబతుకుల మధ్య ఉన్నారు. ఇవాళ కొంతమంది రోగులు వెళ్తే... కరెంటు లేనికారణంగా చేయలేమని సిబ్బంది నిస్సహాయత వ్యక్తంచేసినట్టుగా కొంతమంది రోగులు మా దృష్టికి తీసుకువచ్చారు. సోంపేట ప్రభుత్వాసుపత్రిలో 13 యూనిట్లు మీద ప్రతిరోజూ 39 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ జరుగుతుంది. వీరికి డయాలసిస్ ఆగిపోతే.. వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ సమస్యను కూడా ఊహించలేకపోయిన చంద్రబాబు సర్కారుకు ఈరాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? ఆయనకు ఎలాంటి అనుభం ఉందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. కరెంటు సరఫరాను పునరుద్ధరించడానికి కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. చెట్లను తొలగించడానికి అవసరమైన చిన్నపాటి పనిముట్లనుకూడా అందించలేకపోయారు. జనరేటర్లను సిద్ధంచేయలేకపోయారు. తుపాను ప్రభావం లేని శ్రీకాకుళం పట్టణంలో ముందస్తు జాగ్రత్తగా బు«ధవారం రాత్రి 9 గంటలకు కరెంటు తీసేస్తే గురువారం రాత్రి 8 గంటల తర్వాతకూడా ఇవ్వలేదు. పట్టణంలోని కేవలం ఒకే ఒక్క కాలనీకి మాత్రమే ఇవ్వగలిగారు. ఈ ప్రభుత్వం తుపానును ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణలు అవసరంలేదు. గతంలో హుద్ హుద్ తుపాను సమయంలోనూ చంద్రబాబుగారు ప్రమోషన్‌కే పరిమితమయ్యారు. హుద్ హుద్ నష్టం రూ.85వేల కోట్లకుపైగా అన్నారు... ప్రభుత్వం ఖర్చుచేసింది రూ.884 కోట్లు మాత్రమే. ఇళ్లు దెబ్బతిన్నవారికీ ఇళ్లు ఇస్తామని చెప్పి.. నాలుగేళ్లు గడిచినా ఇవ్వలేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికీ ఇళ్లకోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుగారికి పబ్లిసిటీ తప్ప.. ప్రజల కష్టాలు, వారి ప్రయోజనాలు పట్టవు. ఆయన తుపానులు కాదుకదా.. పిల్లకాల్వకూ ఎదురీదలేడు.