ప్రమాద బాధితులను పరామర్శించడం నేరమా

ప్ర‌కాశం(గిద్దలూరు): కృష్ణా జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి బంధువులను పరామర్శించడం నేరమా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. ప్రమాద బాదితులను పరామర్శించేందుకు వైద్యశాలకు వెళ్లిన ప్రతిపక్షనేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల్లోనూ, ప్రకృతి విపత్తులు జరిగిన సమయంలో బాధితులను పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకున్నా ప్రతిపక్షనేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాదితులను పరామర్శించేందుకు వెళ్లి, క్షతగాత్రులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారని, దీన్ని అధికార టీడీపీ శవరాజకీయాలు చేసి వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించడం దారుణమన్నారు. టీడీపీ నాయకులకు చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, బాదితులను మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్‌ యజమానిపై కేసు నమోదు చేయాలని కోరినందుకు ఇలా అక్రమంగా కేసులు పెట్టడం తగదని, ఇలాంటి నీతిమాలిన చర్యలు మానుకోవాలని ఆయన విమర్శించారు. వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సీఎం నిరంకుశ వైఖరిని మానుకోవాలని నినాదాలు చేశారు.  అనంతరం డిప్యూటీ తహశీల్దారు పి.కాదర్‌వలికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి పల్లె పాల్‌ప్రతాప్, నాయకులు బారెడ్డి రమణారెడ్డి, చెక్కెర బాలనాగిరెడ్డి, మండ్ల రంగనాయకులు, రామిరెడ్డి రామక్రిష్ణారెడ్డి, షేక్‌ ముస్తాఫా, వి.వెంకటరెడ్డి, వై.బాలు, ఐ.వీ.రెడ్డి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Back to Top