విజయవాడ: సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై టీడీపీ నేతలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. తాజాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ తప్పించుకొనే వ్యాఖ్యలు చేశారు. భూముల వేలం పాటకు తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు వెళ్లారని, ఈ వ్యవహారంలో వివరాలు తెలియక ఇరుక్కుపోయామని ఆయన అన్నారు. సత్రం భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, పైగా కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు. వేలంపాటలో నిబంధనల మేరకే భూములు కొనుగోలు చేసినట్లు రామనుజయ తెలిపారు. అయితే ఎకరా రూ.6.5 కోట్లు విలువ చేస్తుందని, ఎండోమెంట్ అధికారి తేల్చిన విషయం తెలియదా అన్న మీడియా ప్రశ్నకు రామనుజయ సమాధానం దాటవేశారు.