ప్రేమంటే ఏమిటో చూపిస్తా

ప్రేమంటే ఏమిటో చూపిస్తా


అనంతపురం:  తాము అధికారంలోకి వస్తే విప్లవాత్మకమైన కార్యక్రమాలను, పకడ్బందీ ఏర్పాట్లతో అమలు పరుస్తామని ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడనే ధైర్యాన్ని ప్రతి తల్లి తన బిడ్డలకు ఇచ్చే రీతిలో తమ పథకాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం కూడేరులో  నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
నవరత్నాల కార్యక్రమంతో పేదలపై ప్రేమంటే ఏమిటో చూపిస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న తన వద్దకు వస్తున్న చిన్నారులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, వారందరినీ బడుల్లోకి పంపించాలంటూ తల్లిదండ్రులకు చెపుతున్నానని  అన్నారు. పేద బడుగు వర్గాలకు చెందిన వారంతా రేపొద్దున డాక్టర్, ఇంజనీరింగ్ చదివితేనే ఆ కుటుంబాల్లో  వెలుగులు నిండుతాయన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారి చదుకోడానికి అవసరమైన తోడ్పాటు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య కోసం ఏటా లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం 30-35 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, ఇది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితి ఉందన్నారు.  మిగిలిన మొత్తం కోసం తల్లిదండ్రులు తమ ఇళ్లను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మార్పుు తెస్తామన్నారు. దివంగత నేత వైయస్ఆర్ కొడుకుగా రెండు అడుగులు ముందుకేసి, ఆ ఫీజులను కూడా కట్టడంతో పాటు, వారి హాస్టల్, మెస్ ఛార్జీల కోసం మరో 20 వేలు కూడా ఇస్తామని ప్రకటించారు. పాఠశాల స్థాయిలో పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా 15 వేలు ఇస్తామన్నారు.
 గ్రామ సచివాలయాలతో 72 గంటల్లో సంక్షేమ పథకాల లబ్ది కల్పిస్తామని,  రెక్కాడితే గానీ, డొక్కాడని వారికి అండగా ఉండేందుకు ఫించను వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడనే ధైర్యాన్ని ప్రతి తల్లి తన బిడ్డలకు ఇచ్చే రీతిలో తమ పథకాలుంటాయని స్పష్టం చేశారు.

Back to Top