ఇది రాక్షస రాజ్యం...

పత్తికొండ

11 నవంబర్ 2012 : 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర సాగిన పలుచోట్ల వ్యవసాయ కూలీలు షర్మిలను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు.
'కరువు పనులు లేవు. కూలికి పోయినా రూ. 30, రూ. 40 మాత్రమే వస్తోంది.. ఒక
రోజైతే రూ. 12 మాత్రమే వచ్చింది. అడిగితే మీకు దిక్కున్నచోట
చెప్పుకోండంటారు. ఇందులో రానుపోను చార్జీలకే నాలుగైదు రూపాయలు పోతాయి.
అందుకే గుంటూరు జిల్లాకు మిర్చి ఏరడానికి వలస వెళతాం.' అని రైతులు శనివారం
పాదయాత్రలో షర్మిలతో వాపోయారు. దీనికి చలించిన షర్మిల 'అసలు మనుషులేనా మీరు
అని ఆ అధికారుల్ని అడగాల్సింది. రూ. 12 కూలితో ఎలా బతుకుతారు? ఏం అవ్వా.. ఈ
వయసులో కూడా కూలి పనికి వచ్చావా.. నిన్ను చూస్తుంటే మనసుకు కష్టంగా
ఉందమ్మా..'
అని ఆవేదనగా అన్నారు.
'కష్టం చేస్తేనే కడుపులోకి మెతుకులుపోయేది.. ఉన్న పెన్షన్ కూడా పోయింది' అని ఆ అవ్వ వాపోయింది.  దీనిపై షర్మిల ఆగ్రహంగా
'ఇది
రాక్షస రాజ్యం. నీళ్లు ఉండవు. పంటలు పండవు. పనులు ఇవ్వరు. ఉన్న పెన్షన్
తీసేస్తారు.' అని ప్రభత్వ సంవేదనా రాహిత్యాన్ని దుయ్యబట్టారు. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని రాతనకు చెందిన రైతు నాగరాజు ఇలాగే చేలో పని చేసుకుంటూ షర్మిలను చూసి దగ్గరకు వచ్చి తన బాధలు చెప్పుకున్నాడు. తాను పది ఎకరాలు గుత్తకు తీసుకుని పప్పు శెనగ పంట వేశాననీ, గుత్త కోసం ఎకరాకు రూ. 8 వేలు పోగా, పెట్టుబడిగా ఎకరాకు రూ.7,200 చొప్పున పెట్టాననీ చెప్పాడు. ఈ ఏడాది సబ్సిడీ కింద రావాల్సిన శనగలు 20 రోజులు ఆలస్యంగా పంపిణీ చేశారనీ,  దీంతో ఎక్కువ ధరతో ముందే కొనాల్సి వచ్చిందనీ, దళారులకు అమ్ముకోవడం కోసమే వీళ్లు ఆలస్యంగా తెస్తున్నారనీ అతడు వాపోయాడు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 400గా ఉన్న ఎరువుల బస్తా ఇప్పుడు రూ. 1,200 అయ్యిందనీ, విత్తనాలు మూడు రెట్లు పెరిగాయనీ, దీంతో పెట్టుబడి కూడా గిట్టడం లేదనీ అతడు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక రెండేళ్లుగా పంట చేతికి అందలేదనీ, అప్పులు మాత్రం ఏటా పెరిగి తమ బతుకులు బజారున పడ్డాయనీ ఆ రైతు నిర్వేదంగా అన్నాడు. "మళ్లీ బాగా బతుకుతామన్న భరోసా లేదు. ఇక ఆత్మహత్యలే గతి. చావడం తప్ప ఇంకో పరిష్కారం లేదనిపిస్తోంది" అని  అతడు షర్మిల ముందు కంటతడి పెట్టుకున్నాడు.
అతడు చావు తప్ప మరో పరిష్కారం లేదనడంతో షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ. 'వద్దన్నా.. ఆ మాట అనొద్దు' అని ఆమె ఓదార్చారు. 'అప్పు కడతారా? ఇల్లు రాసిస్తారా? అని అప్పు తీసుకున్నవాళ్లు అడుగు తున్నారమ్మా' అంటూ నాగరాజు చెప్పాడు. దీనికి షర్మిల 'రాజన్న కొడుకున్నాడని మరచిపోకన్నా. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడు. అంతవరకు ధైర్యంగా ఉండాలన్నా. రైతులందరికీ నాదొక్కటే మనవి. ప్రాణాలు చాలా విలువైనవి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మంచికాలం మళ్లీ వస్తుంది. రాజన్న ఉన్నప్పుడు రైతుకు ఎంత చేసినా తక్కువే అని ఆలోచించేవాడు. జగనన్న కూడా రైతు క్షేమమే తలుస్తున్నాడు' అని ధైర్యం చెప్పారు.
శనివారం షర్మిల పాదయాత్ర 13.2 కి.మీ.మేర సాగింది. ఇప్పటివరకు 24 రోజుల్లో మొత్తం  310 కి.మీల మేరకు పాదయాత్ర పూర్తయింది. కాగా వైఎస్ అభిమాని ఒ.ఎస్.ఆర్.కుమార్ రచించి, రూపొందించిన ఆడియో సీడీని షర్మిల ఆవిష్కరించారు. ఈ గీతాన్ని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించగా, అనూప్ సంగీతం అందించారు. 24 వ రోజు పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, రాజేశ్, పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ప్రసాదరాజు, ఎస్వీ మోహన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, జనక్‌ప్రసాద్, కోట్ల హరిచక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top