ఇది పేదల ప్రభుత్వం కానేకాదు: షర్మిల

రంగాపురం (కర్నూలు జిల్లా), 14 నవంబర్‌ 2012: రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది పేదల బాగోగులు చూసే ప్రభుత్వం కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి పేదల కష్టాలు, కన్నీళ్ళు అసలే పట్టవని ఆమె నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బుధవారం రాత్రికి కర్నూలు జిల్లాలోని రంగాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని తలపిస్తూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిల ముందు ఏకరువు పెట్టారు. గ్రామంలో నెలకొన్న ఫ్లోరైడ్‌ సమస్య గురించి ఆమె దృష్టికి తీసుకువచ్చారు. రంగాపురం రచ్చబండ కార్యక్రమంతో షర్మిల 28వ రోజు పాదయాత్ర ముగిసింది.

ప్రజల కష్టాలను సావధానంగా విన్న షర్మిల మాట్లాడుతూ, రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలని కృషి చేస్తున్న జగనన్నను మీరంతా ఆశీర్వదిస్తే మీ కష్టాలన్నీ తీరుస్తాడని హామీ ఇచ్చారు. రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలను అన్న అందిస్తాడని భరోసా ఇచ్చారు. ఉపాధి కూలి డబ్బులను 130 రూపాయలు ఇస్తాడన్నారు. మహానేత ఇచ్చిన హామీ వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను తప్పకుండా సరఫరా చేయిస్తారని పేర్కొన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగాను, బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడని షర్మిల రంగాపురం వాసులకు హామీ ఇచ్చారు. రాజన్న రాజ్యాన్ని స్థాపించే దిశగా జగనన్న మనల్నందర్నీ తీసుకువెళతారని అన్నారు.

నీచమైన రాజకీయాలకు పాల్పడి కాంగ్రెస్‌, టిడిపిలు కమ్మక్కై కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని షర్మిల విమర్శించారు. విచారణ సాకుతో జగనన్నను అకారణంగా జైలుపాలు చేశారని ఆరోపించారు.

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల బుధవారంనాడు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రాజన్న బిడ్డకు కర్నూలు జిల్లా జనం నీరాజనాలు పలుకుతున్నారు. మొత్తం 28వ రోజు పాదయాత్ర ముగిసే సరికి షర్మిల 361.3 కిలోమీటర్లు నడిచారు. షర్మిల ఏ గ్రామానికి వెళ్ళినా అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు వేల సంఖ్యలో ఎదురేగి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అక్కున జేర్చుకుని ఆదరిస్తున్నారు. రంగాపురం శివార్లలో షర్మిల బుధవారం రాత్రికి బస చేస్తారు.
Back to Top