<strong>గుడిపాడు (కర్నూలు జిల్లా)</strong> 19 నవంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారంనాడు కర్నూలు జిల్లా గుడిపాడులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మహిళలు, స్థానికులు, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర 33వ రోజులో భాగంగా ఆమె గుడిపాడులో ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిలకు విన్నవించారు. తమ గ్రామానికి గాజులదిన్నె నుంచి వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే నీటి సరఫరా జరుగుతుండడంతో వ్యవసాయం చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వృద్ధులు, వితంతువుల పింఛన్లను ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.<br/>గ్రామస్థుల గోడును శ్రద్ధగా విన్న షర్మిల స్పందిస్తూ, ఇది క్రూరమైన ప్రభుత్వం అని విచారం వ్యక్తం చేశారు. పేదల శ్రమను దోపిడీ చేస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారని అన్నారు. జగన్ సిఎం అయితే, గాజులదిన్నె నుండి ప్రతిరోజూ నీళ్ళు వచ్చేలా చేస్తారని భరోసా ఇచ్చారు.<br/>కాగా, తన కూతురికి గుండె శస్త్ర చికిత్స అవసరమని ఓ మహిళ షర్మిల ముందు భోరున విలపించింది. ఆ కన్నతల్లి ఆవేదన చూసిన షర్మిల చలించిపోయారు. స్పందిస్తూ కలెక్టర్తో మాట్లాడి, ఆపరేషన్ చేయిస్తానని ఆమెకు షర్మిల హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రజా సమస్యలను జగన్ పరిష్కరించి, రాజన్న రాజ్యాన్ని తెస్తారని ప్రజలకు షర్మిల హామీ ఇచ్చారు.