రైతుల నోట్లో మట్టి కొట్టాడు

()కరువుతో రైతులు వలసలు పోతున్న దుస్థితి
()మహానేత హయాంలో రైతులు రారాజుగా బతికారు
()బాబు హయాంలో రైతులు కూలీలుగా మారారు
()రైతులను లాఠీలతో కొట్టించి జైళ్లో పెట్టించడం దారుణం
()కేసీఆర్ ప్రాజెక్ట్ లు కడుతుంటే బాబు చోద్యం చూస్తున్నారు
()రైతు మహాధర్నాలో వైయస్ జగన్ వ్యాఖ్యలు

అనంతపురంః దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులు రాజుల్లాగా బతికితే బాబు హయాంలో రైతులు కూలీలుగా మారారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మహాధర్నా సందర్భంగా మాట్లాడుతూ....క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలకు తోడుగా ఉండి వారి కష్టనష్టాల్లో చేదోడువాదోడుగా ఉండాలే తప్ప దూరంగా పారిపోవడం సరికాదని సూచించారు. ఉల్లి, టమోట ధరలు పతనమైప్పుడు రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కితే వారిని తీవ్రవాదుల్లాగా లాఠీలతో కొట్టించి జైళ్లలో పెట్టించడం  చాలా బాధాకరమన్నారు. తీవ్రమైన కరువుతో రైతులు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పరిగెడుతుంటే వారికి సీఎం చేసిన సాయం ఏంటని ప్రశ్నించారు. 

ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవ్వకుండా ఉండేందుకే
రైతులు కరువుతో అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కరువే లేదని చెప్పడం కూడా కుట్ర దాగి ఉందని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. రైతులకు ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవ్వకుండా ఎగవేసేందుకు వారు భిన్నమైన ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల పర్యటనలకొచ్చినప్పుడు రుణాలన్నీ మాఫీ చేస్తానని బాబు మాట ఇచ్చి తప్పారని దుయ్యబట్టారు. ఎంతమందికీ మాఫీ అయ్యిందని రైతులను ప్రశ్నించగా వారు మాఫీ కాలేదని ముక్తకంఠంతో నినదించారు. బాబు చేసిన రుణమాఫీ వారి వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. ఉత్తుత్తి వినతిపత్రాలు పట్టుకుని కేంద్రం చుట్టూ తిరగడం కాకుండా రైతులకు చేసే ప్రయోజనం పైన ముఖ్యమంత్రి దృష్టిసారిస్తే మంచిదన్నారు. రెండున్నరేళ్ల బాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. రైతులకు ఉపయోగ పడే విధంగా ఏ ప్రాజెక్టును పూర్తిచేయలేదని పేర్కొన్నారు. 

రూ. 2360 కోట్లు ఎగనామం
2013–14 సంవత్సరానికి కేటాయించిన ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు ఖర్చుపెట్టకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. ఆ నిధులనే చెట్టు నీరు అంటూ ఇతర పథకాలకు కేటాయిస్తూ రైతుల నోట్లో మట్టి కోట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రూ. 2360 కోట్లలో కూడా కేంద్రం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. అయితే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 1500 కోట్లు కేటాయించాలని కలెక్టర్లు సూచించగా కేవలం రూ. 692 కోట్లకే పరిమితం చేశారని తెలిపారు. అయితే దానిలో కూడా రూ. 90కోట్లు ఇన్‌పుట్‌ సబ్బిడీని మిగిలిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం దారుణంగా ఉందన్నారు. దానిలో ఇప్పటికీ 60 కోట్లు బకాయి ఉందన్నారు. కాగా 2015–16కు సంబంధించి రూ.990 కోట్లకు గాను ఇప్పటికీ ఒక్కరూపాయి కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో రైతులు నష్టపోవడం ఒక కారణమైతే కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్న నకిలీ విత్తనాలతో మరింత నష్టం వాటిల్లుతోందని అన్నారు. దాంతోపాటు విత్తనాల ధరలు కూడా చుక్కల్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. 

కేసీఆర్‌ ప్రాజెక్టులు కడుతుంటే ఏం చేస్తున్నారు..?
ఎగువ రాష్ట్రమైన తెలంగాణలో గోదావరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూడటం సరికాదన్నారు. గతంలో బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి హంద్రీనీవాకు 13 కోట్లు, పులిచింతలకు 24 కోట్లు, పోలవరంకు 7 కోట్లు వెలుగొండకు 13.5 కోట్లు కేటాయింపులు చూస్తుంటేనే ప్రాజెక్టుకుల విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. ఐదేళ్ల కాలంలోనే 80 శాతం ప్రాజెక్టులను పూర్తిచేసిన ఘనత దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అన్ని పంపుసెట్లు సిద్ధంగా ఉండి కూడా శ్రీశైలం నుంచి హంద్రినీవాకు ఎందుకు నీళ్లు రావడం లేదో స్పష్టం చేయాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టులకు కక్కుర్తి పడకపోయుంటే ఈ పాటికే హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయి ఆరు లక్షల ఎకరాలకు నీరందేదని వెల్లడించారు. కాలువలు తవ్వేందుకు వెయ్యి కోట్లు ఖర్చు చేసుంటే వర్షపు నీరు సముద్రంలో కలిసేది కాదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమలో రతనాలు పండిస్తానన్న చంద్రబాబు ఎండిపోతున్న పంటలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కరువుతో అల్లాడిపోతున్న రైతులు పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం పరుగులు పెడుతుంటే చంద్రబాబు వారి కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. బాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని అదే రైతులకు శాపంగా మారిందన్నారు. వరుసగా కరువు నెలకొంటుంటే బాబు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారో తెలియజేయాలన్నారు. 

వైయస్‌ఆర్‌ వస్తూనే రుణమాఫీ చేశారు.. 
ప్రకృతి వైపరీత్యాలు, కరువులు చాలా సర్వసాధారణమని.. దీనికి ఎవరూ అతీతులు కాదని అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన రైతు మహా ధర్నాలో వైయస్‌ జగన్‌ అన్నారు. అయితే అలాంటి సందర్భాల్లోనే రైతులకు అండగా నిలవడం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే తొలి సంతకం రైతు రుణమాఫీపై చేసి రైతుల పట్ల తనకున్న నిబద్ధతను చాటారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. విద్యుత్‌ బకాయిలు మాఫీ చేయడం.. రుణాలను రీషెడ్యూల్‌ చేయడం చేసి రైతు బాంధవుడిగా నిలిచారన్నారు. కరువుల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఆపద్భాంధవుడిగా నిలిచి వలసలకు అడ్డుకట్ట వేసిన ఘనత వైయస్‌కే దక్కుతుందని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను 90 శాతం రైతులకు కేటాయించి రైతే రాజన్న నానుడికి వాస్తవ రూపం తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడ్డారని పేర్కొన్నారు. 

జయతీ ఘోష్‌ విధానాల అమలుకు వైయస్‌ పట్టు...
కరువు పరిస్థితులను పారద్రోలాలంటే జయతీ ఘోష్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతోపాటు ఆర్బీఐ గవర్నర్‌ వరకు తిరిగి సాధించిన ఘనత మహానేతకే దక్కుతుందన్నారు. ఆనాడు కేంద్రం దేశవ్యాప్తంగా 31 కరువు జిల్లాలను ప్రకటిస్తే అందులో 16 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేలా పోరాడి సాధించిన మహానాయకుడు వైయస్‌ఆర్‌ అని జగన్‌ కొనియాడారు. తద్వారా రైతులకు మేలు జరిగేలా కృషి చేశారన్నారు. అంతేతప్ప ఉత్తుత్తి అర్జీలు పట్టుకుని ఢిల్లీలో తిరుగుతూ కాలక్షేపం చేయలేదని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీలు, క్రాప్‌ ఇన్సూరెన్సులు, రుణాల మాపీల పేరుతో నిత్యం రైతులకు అండగా ఉండి సేవ చేశారని వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఆయన కీర్తించారు. రూ. 1100 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించి వారి ముఖంలో చిరునవ్వులు చూడాలని తపించిపోయేవారిని తెలిపారు. వరికి మద్ధతు ధర 560 నుంచి రూ.1030లకు పెరగడం దివంగత వైయస్‌ఆర్‌ చలవేనన్నారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులే రాజులుగా బతికారని.. నేడు బాబు హయాంలో రైతుల్ని కూలీలను చేసి రాష్ట్రం నుంచి ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లేలా చేశారని ఆరోపించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతులకు, పార్టీ కార్యకర్తలకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రైతుల సమస్యలపై పార్టీ నాయకులతో కలిసి వైయస్ జగన్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. 
Back to Top