50శాతం ప్రాజెక్టులు వైయస్‌ఆర్‌ పూర్తి చేశారు

– చంద్రబాబు చేసేవన్నీ వాటికి శంకుస్థాపనలే
– ప్రాజెక్టులకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు
– పోలవరం, పట్టిసీమ అవినీతిపైనే మా పోరాటం
– అంచనాలు పెంచేసి శంకుస్థాపనలు చేయడం అభివృద్ధా 
– వైయస్‌ఆర్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

ఆడలేక మద్దెల మీద పడినట్టు చంద్రబాబు ప్రాజెక్టులను పూర్తి చేసే సత్తా లేక వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రోజుకో శంకుస్థాపన, మాయమాటలతో కాలక్షేపం చేసే బాబుకు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తామెప్పుడూ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని పోలవరం, పట్టిసీమ పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని శ్రీకాంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు. మహానేత పదివేల కోట్లతో పోలవరం పూర్తి చేయడానికి పూనుకుంటే బాబు అవినీతితో ఇప్పుడది 40వేల కోట్లకు చేరుకుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేస్తానంటే కమీషన్లు దండుకోవడం కుదరదని ఏ అర్హతా లేని ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి పనులు అప్పగించారని ఆయన విమర్శించారు. 
బాబూ.. పోలవరం అడ్డుకుంది నీవు కాదా
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైయస్‌ఆర్‌ కంకణం కట్టుకుంటే ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రులను కలిసి అడ్డం తిరిగేలా చేసింది నీవు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. దమ్ముంటే బహిరంగ విచారణకు రావాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ఇష్టంలేక కోర్టులకెళ్లి స్టేలు తెచ్చిన నీచ రాజకీయం మరిచిపోయావా అని ప్రశ్నించారు. పదివేలా 600 కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తి పడి అంచనాలు పెంచి 40 వేల కోట్లకు తీసుకెళ్లడం దారుణమన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌సీపీ ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు. కాకపోతే ప్రాజెక్టులు పేరుచెప్పి చేస్తున్న అవినీతిని మాత్రమే తాము అడ్డుకుంటున్నామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆనాడు పోలవరం కోసం అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తుంటే నిత్యం ఏదో వంకతో అడ్డుపుల్లలు వేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. భగీరథ లక్ష్యంతో ప్రాజెక్టులు పూర్తిచేస్తుంటే ఓర్వలేక చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ మరణం తర్వాత కిరణ్‌ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మకై సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారని విమర్శించారు. పోలవరం కుడి కాలువ 140 కిమీల పనులు వైయస్‌ఆర్‌ హయాంలోనే పూర్తి చేస్తే మిగతా 30 కిమీల పనులు జరక్కుండా కోర్టుకెళ్లి అడ్డుకుంది నీవు కాదా అని ప్రశ్నించారు. కాగా పోలవరం ఎడమ కాలువను 2007–09 మధ్య కాలంలోనే 106 కిమీల మేర మహానేత వైయస్‌ఆర్‌ పూర్తి చేశారని తెలిపారు. దాన్నిప్పుడు పురుషోత్తంపట్నం పేరుతో ప్రాజెక్టుగా చూపించడం జనాన్ని మోసం చేయడమేనన్నారు. 600 కోట్లతో పూర్తయ్యే పనులను 1600 కోట్లకు అంచనాలు పెంచేసి వెయ్యి కోట్లు దోచుకోవడంపైనే వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. మూడు బడ్జెట్‌లో కేంద్రం పోలవరం కోసం 500 కోట్లు కూడా కేటాయించలేదని.. ఈ మధ్యనే ఇచ్చిన 1980 కోట్లు నాబార్డు నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. 40 వేల కోట్ల పోలవరం ప్రాజెక్టుకు నిధులెలా తెస్తావా, నాబార్డు ఇంకెంత మేర సాయం చేయబోతోందో జనాలకు తెలియాలన్నారు. పోలవరం కోసం ఈ మూడేళ్లలో చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. కనీసం నిధుల కోసం కేంద్రంతో పోరాడి సాధించలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. పోలవరానికి జాతీయ హోదా, ముంపు మండలాల విలీనం గత యూపీఏ హయాంలో ఇచ్చిందే కదా కొత్తగా బాబు సాధించిన ఘనత కాదని స్పష్టం చేశారు. కేవలం మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ప్రసగించారు. సాక్షాత్తు మీ టీడీపీ నాయకుడు ఎర్ర నారాయణ స్వామి పోలవరాన్ని అడ్డుకుంది చంద్రబాబేనని బహింరంగంగా విమర్శించిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. 
ఐదేళ్లలో 41 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత వైయస్‌ది
ఐదేళ్ల కాలంలో 41 ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇది తాను చెప్పే మాటలు కాదని సాక్షాత్తు చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం చెప్పే మాటలన్నారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం 1994–2004 మధ్య కాలంలో చంద్రబాబు ప్రాజెక్టుల కోసం పది వేల కోట్లు ఖర్చు చేస్తే 2004–2014 మధ్య కాలంలో 96 వేల కోట్లు ఖర్చయ్యాయని ఈ పదేళ్లలో ఐదేళ్లే వైయస్‌ఆర్‌ సీఎంగా వున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. 23.5 లక్షల హెక్టార్లకు నీళ్లిచ్చారని ఆనాడు చెప్పుకొచ్చిన చంద్రబాబుకు అదే మాట ఈరోజు చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల కాలంలో వైయస్‌ఆర్‌ 86 ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే 85 ప్రాజెక్టులను ప్రారంభంచారని తెలిపారు. 16 ప్రాజెక్టులు వంద శాతం పూర్తయితే మరో 25 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయని తెలిపారు. యాభై శాతం ప్రాజెక్టులను ఐదేళ్ల కాలంలోనే పూర్తిచేసిన ఘనత వైయస్‌కే దక్కుతుందన్నారు. పోలవరం కోసం అన్ని అనుమతులు సాధించుకొచ్చిన వైయస్‌ఆర్‌కు జూబ్లీహాల్‌లో సన్మానం చేసిన సంగతి మరిచిపోయారా అన్నారు. కమీషన్ల కోసం పోలవరం అంచనాను 40 వేల కోట్లకు పెంచిన బాబు అదే ప్రాజెక్టును పది వేలా 600 కోట్లతో పూర్తి చేసేందుకు వైయస్‌ఆర్‌ సిద్ధమైన సంగతి గుర్తులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలాంటి మహోన్నత వ్యక్తిని భూమి మీద లేని వ్యక్తి గురించి అసభ్యంగా మాట్లాడటం చంద్రబాబు సంస్కారలేమికి నిదర్శనమన్నారు. 

జేసీ.. నోరు జారితే నాలుక కోస్తాం
జేసీ దివాకర్‌రెడ్డి వైయస్‌ఆర్‌ గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తేడా వస్తే నాలుక కోస్తామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే 90 శాతం పూర్తి చేశారని.. మరో 5శాతంకిరణ్‌ సీఎంగా పూర్తిచేస్తే కేవలం 5 శాతం పూర్తి చేసి తానేచేసినట్టు చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముచ్చుముర్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ప్రారంభోత్సవంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూట్లు నాకే కుక్కకి చెరుకు రుచి తెలియదని.. నాలుగు పెగ్గులు జానీవాకర్‌ తాగితే తప్ప మాటలు పెగలని దివాకర్‌రెడ్డికి వైయస్‌ పేరు తలచుకునే అర్హత కూడా లేదన్నారు. రాజకీయ జీవితం చరమాంకంలో మర్యాదగా వ్యవహరించాలని హితవు పలికారు. తనకే సంబంధం లేని ప్రాంతంలో ఏ హక్కుతో వచ్చి జేసీ దివాకర్‌రెడ్డి కర్నూలులో వేదికపై మాట్లాడారని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ ప్రకారం మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య మైక్‌ కట్‌ చేసి సంబంధం లేని వ్యక్తితో మాట్లాడించడం చంద్రబాబుకు నికృష్ట రాజకీయాలకు నిదర్శనమన్నారు. పోలవరం కోసం వైయస్‌ఆర్‌ పడిన తపన జేసీకి తెలియదా అని ప్రశ్నించారు. అనంతపురంలో తన మాటలు చెల్లక మంత్రి సునీత, పయ్యావుల కేశవ్‌లు సంపాదించుకుంటుంటే చూస్తూ ఊరుకోలేక తనకు ఆదాయ మార్గాలు దొరక్క మతి భ్రమించినట్లుగా జేసీ మాట్లాడుతున్నాడని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గట్టిగా మాట్లాడితే తనపై చంద్రబాబు కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తాడేమోనని జేసీకి భయమని వెల్లడించారు. ఒక దళిత నాయకుడికి నిండు సభలో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన అవమానం ప్రభుత్వానికే కళంకమన్నారు. చంద్రబాబు కులహంకారానికి ఇది నిదర్శనమన్నారు. 
Back to Top