దోచుకోవడం తప్ప ఆదుకోవడం తెలియని ప్రభుత్వం

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ నేతలకు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే ధ్యాస తప్పితే.. సాగునీరు అందించి రైతులను ఆదుకుందామనే «తాపత్రయం లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ప్రజా సొమ్ము, ప్రకృతి వనరులను అడ్డగొలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆరుతడి పంటలకు వెంటనే సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఎస్పీ అధికారులకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆరుతడిపంటలకు సాగునీరు ఇస్తామని చెప్పటంతో రైతులు మొక్కజొన్న, మిర్చి లాంటి పంటల సాగుచేస్తున్నారన్నారు. రెండు నెలలు ఇచ్చి మూడవ నెల గడుస్తున్నా ఇప్పటివరకు నీరు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మినుము, కంది వేసిన రైతులు పూర్తిగా నష్టపోయి, తిరిగి మొక్కజొన్న, మంచిశెనగ, మిర్చిపై ఆశలు పెట్టుకొని వేశారన్నారు. వీటిలో వెంటనే మొక్కజొన్నకు ఆరుతడి నీరు అందితే రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన 5టీఎంసీల నీరు ఇస్తామని ఎస్‌ఈ ప్రకటించి ఆరురోజులైనా ఇప్పటివరకు నీటి జాడ కానరాకుండా పోయిందన్నారు. అదేమంటే 8వ తేదీన నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కుంటిసాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద పంటలు పండటమే కష్టంగా ఉందని, పండిన పంటలకు సాగునీరు ఇచ్చి కాపాడుకునే పరిస్థితి కల్పించాల్సివుందన్నారు. మిర్చి తేజ రకం ధర రూ.12వేలు నుంచి రూ.7వేలకు, కంది రూ.6వేలు నుంచి రూ.4వేలకు పడిపోయిందన్నారు. పత్తిని రూ.4,500లకు కొంటున్నారన్నారు. రైతులు ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం చాలా దారుణమని మండిపడ్డారు. కృష్ణా బోర్డు 5టీఎంసీల నీరు వాడుకోవచ్చని చెబితే తెలంగాణా ప్రభుత్వాన్ని అడిగి సాధించుకునే ధమ్ము, ధైర్యం సీఎం చంద్రబాబుకు లేవన్నారు. రైతులకు నీరు ఇవ్వాలని ఎన్‌ఎస్పీ చీఫ్‌ ఇంజనీర్‌తో కూడా మాట్లాడామని చెప్పారు. రైతుల పరిస్థితిపై అధ్వయనం చేసి వారి కష్టాలను తీర్చితేనే ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని లేకపోతే చంద్రబాబుకు ఈసారి రైతులు బుద్దిచెబుతారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. 
Back to Top