ఏర్పేడుః ప్రభుత్వం వెంటనే మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటన మృతుల కుటుంబాలను నాగిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతేడాదిలో ఒక క్వింటా మిర్చి ధర రూ.10 వేలు ఉందన్నారు. ఎకరాకు 22 క్వింటాల దిగుబడులు రావడంతో లాభసాటిగా ఉందని ఈ ఏడాది రాష్ట్రంలో 2.03 లక్షల హెక్టారులలో మిర్చి పంటను రైతులు సాగు చేశారన్నారు. ఆశించిన విధంగా మద్దతు ధరలేక పోవడంతో మిర్చిరైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు.
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డుకు వచ్చి రైతులతో మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీలో మిర్చి రైతుల దుస్థితిపై గళమెత్తితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక క్వింటాకు రూ.1500 బోనస్ ఇస్తామని ప్రకటించి దాన్ని అమలు చేయకుండా మాట తప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలని ఆదేశించినe రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయలేదన్నారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే మిర్చి రైతులతో పెద్ద ఎత్తునఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదనరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఆదికేశవులురెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.