ధరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలి

సత్తెనపల్లి: మిర్చి, కంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని వైయస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని వైయస్సార్‌సీపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గత 25 ఏళ్ళలో ఎప్పడూ లేని విధంగా పండించిన ఉత్పత్తు లకు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతున్నా రన్నారు. మిర్చి క్వింటా రూ.12 వేలు ఉండాల్సింది కనీసం రూ.2 నుంచి రూ.2,500 కూడా కొనే దిక్కులేక పండించిన పంట పొలంలో, రోడ్ల పైన మిర్చి తగల బెడుతున్నా రన్నారు. కోత కూలి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, కంది, పసుపుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. కానీ రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధరల స్థీరీకరణ ఏర్పాటు చేసి ప్రకాశం, గుంటూరు జిల్లాలోని రైతులను ఆదుకోవాలన్నారు.  2004లో ఇదే పరిస్థితి వస్తే అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌రాజశేఖరరెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోలు చేయించటం జరిగిందన్నారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదన్నారు. రైతుల పక్షాన నిలబడి పోరాడతామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతుందో మిర్చి రైతుల పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమౌతుందన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నో హమీలు ఇచ్చిందని వాటిల్లో ఏ ఒక్క హమీ కూడా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ, నిరుద్యోగభృతి ఇలా ఎన్నో హమీలు ఇచ్చారన్నారు. యువతకు నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఆ హమీ నెరవేర్చుకున్నాడని ఎద్దేవ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. సమావేశం లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు బాసు లింగారెడ్డి, మైనార్టీ సెల్‌జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌మహబూబ్, సత్తెనపల్లి పట్టణ, రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షులు షేక్‌నాగుర్‌మీరాన్, ఏపూరి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కళ్ళం వీర భాస్కరరెడ్డి, ఎస్సీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాస్, పార్టీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

Back to Top