ఫ్లాట్ల కేటాయింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

గుంటూరు హౌసింగ్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేసిన ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించడంలో టీడీపీ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మండిపడ్డారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో హౌసింగ్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  మేరుగు నాగార్జున తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టణ ప్రాంతంలో పేదవాళ్లకు ఇళ్ల నిర్మాణం కోసం గుంటూరులో 2450 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించారన్నారు. ఇందుకోసం నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేశారన్నారు. లబ్ధిదారులు కూడా తమ వంతు వాటాగా కొంత సొమ్ము అధికారులకు చెల్లించారని తెలిపారు. మహానేత మరణాంతరం ఈ ఫ్లాట్ల నిర్మాణం నిలిచిపోయిందన్నారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయించి లబ్ధిదారులకు అప్పగించడంలో టీడీపీ ప్రభుత్వం  మీనామేశాలు లెక్కిస్తుందని మండిపడ్డారు. టీడీపీకి చెందిన కొందరు నాయకులు నిజమైన లబ్ధిదారులను తొలగించి అనర్హులకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు.కొందరు టీడీపీ నాయకులు బ్రోకర్ల అవతారం ఎత్తారని,  ఇళ్లు మంజూరు చేయిస్తామని జన్మభూమి కమిటీలు డబ్బులు వసూలు చేస్తున్నారని పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఇవాళ ధర్నా చేశామన్నారు. పీడీ హామీ మేరకు ధర్నా విరమిస్తున్నామన్నారు. ఒకటో తారీఖులోగా పేదలకు ప్లాట్లు అప్పగించకపోతే 5వ తేదీన «వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని పిన్నెళ్లి హెచ్చరించారు.

పేదలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదు
–ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
పేదలకు మంచి చేయాలన్న ఆలోచన టీడీపీ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.  వైయస్‌ఆర్‌ హయాంలో కట్టించిన ఇళ్లను పూర్తి చేయించి లబ్ధిదారులకు ఇప్పగించకపోవడం దౌర్భగ్యమన్నారు. కట్టించిన ఇళ్లు కూడా కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా? ఎక్కడ దోచుకుందామన్నదే టీడీపీ నేతల ధ్యాస అని విమర్శించారు. ప్రజల సంక్షేమం వీరికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ నుంచి నీళ్లు తెచ్చి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన టీడీపీ నాయకులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు.  ప్రభుత్వ వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తీరు మార్చుకోకపోతే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని గోపిరెడ్డి హెచ్చరించారు.


ఆందోళన తీవ్రతరం చేస్తాం
మ్రరి రాజశేఖర్‌
 లబ్ధిదారులకు ఇళ్ల ఫ్లాట్లు ఇవ్వకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ హెచ్చరించారు. లబ్ధిదారులు తమ వంతు వాట కోసం అప్పులు చేసి డబ్బులు కడితే ఇంతవరకు ఫ్లాట్లు చూపించకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం ఆదర్శనీయమన్నారు. దేశంతో పోటీ పడి పేదలకు ఇళ్లు నిర్మించిన మహోన్నతమైన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. మహానేతకు పేరు వస్తుందనే నెపంతో ఫ్లాట్ల పంపిణీని వాయిదా వేస్తున్నారని ధ్వజమెత్తారు.


తాజా వీడియోలు

Back to Top