సంక్షేమం మరిచి వాతలు... కోతలు

హైదరాబాద్ 01 జూలై 2013:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రజలకు వాతలు, కోతలు అనే నినాదంతో పరిపాలిస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజల నెత్తిన ఏ భారం మోపాలి? రాయితీలు ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనేదే లక్ష్యంగా సాగుతున్నాయన్నారు. ఈ పరిణామాల కారణంగా అవి ప్రజాగ్రహానికి గురయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కొత్తగా ఇంధన సద్దుబాటు పేరుతో 542 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని నిర్ణయించడం దారుణమన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కరెంటు చార్జీలను పెంచి 32 వేల కోట్ల రూపాయల పెనుభారాన్ని మోపిందని చెప్పారు. ఆ భారాన్ని భరించలేక తమ పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేపట్టిందన్నారు. అవిశ్వాస తీర్మానంలో కూడా దీనినే ప్రధానంగా ప్రస్తావించమన్నారు. ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వేటికీ ప్రభుత్వం చలించలేదనీ, మళ్ళీ భారాన్ని మోపడానికి మొగ్గుచూపిందనీ విమర్శించారు. మహానేత పాలనలో ఏ చార్జీ పెంచని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజన్న పాలనే మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన రెక్కల కష్టం మీద కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. జూన్ నెలలో మూడు సార్లు పెట్రోలు ధరలు పెరిగాయనీ, దీని ఫలితం మిగిలిన సరకుల పై పడిన విషయం తెలిసిందేనన్నారు. అంతర్జాతీయ ధరలు బట్టి ఇంధన ధరలు పెరుగుతాయని సాకు చూపించిన కేంద్రానికి ఆమేరకు సగటు జీవి వేతనం పెరుగుతోందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

యూఎస్ఏలోనూ, బ్రిటన్లో అయితే మానవుని జీవన ప్రమాణం ప్రకారం వారికి ఈ పెంపు సహేతుకమవుతుంది తప్ప భారత దేశ ప్రజలకు కాదని భూమన ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలే అజెండాగా అధికారంలోకి వచ్చిన పార్టీ అంతర్జాతీయ మార్కెట్ సాకు చూపి భారం మోపడం హర్షణీయం కాదని ఆయన స్పష్టంచేశారు.
అలాగే 2014 నుంచి సహజవాయువు ధర ఒక బ్రిటన్ మిలియన్ యూనిట్లకు 4.2 నుంచి 8.2 డాలర్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయించడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ఒక్క రిలయన్సు సంస్థకే 47,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రిలయన్సుకు దాసోహనడం వల్ల ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ఈ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే పది వేల కోట్ల రూపాయల మేర వ్యాట్ పెంచిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి 2500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు. అదనపు పన్నులు వేసిందనీ, ఆర్టీసీ చార్జీలు పెంచిందనీ ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం ద్వారా 22 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందడానికి పర్మిట్ రూంగా మార్చిందన్నారు. ఇంటికొక బారు.. మనిషికొక బీరు.. ఇదీ ప్రభుత్వ తీరు అని భూమన ఎద్దేవా చేశారు. ఈ ఆదాయంతో ప్రభుత్వం మనుగడ సాగిస్తోందనీ, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందనీ మండిపడ్డారు. ఈ నాలుగేళ్ళలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుందంటే ప్రజలపై ఎంతటి భారం వేసిందో అర్థమవుతోందన్నారు.

ఈ ఆదాయం ఏమైందో.. పన్నుల కారణంగా సమకూరిన 60 - 70 వేల కోట్ల రూపాలయ ఆదాయం ఎక్కడికి పోయిందో అర్థంకావడంలేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంటును నిర్వీర్యం చేశారనీ, ఆరోగ్యశ్రీలో వ్యాధులు తొలగించారనీ, 108కి డీజిలు కూడా లేకుండా చేశారనీ తెలిపారు. ఏ వర్గానికీ ఉపయోగించే నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ప్రతి పౌరునిమీద ఏదో రూపేణా భారం మోపే నిర్ణయాలు తీసుకుందన్నారు.

రాజన్న పరిపాలన తర్వాత వచ్చిన ఆయన కష్టార్జితం ఇలా కొనసాగడాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు అధికారంలోకి తేవాలా అని కాచుకుని కూర్చున్నారని ఆయన స్పష్టంచేశారు.

Back to Top