రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

  • దున్నపోతుపై వానపడిన చందాన ప్రభుత్వ తీరు
  • రైతుల కోసం వైయస్‌ జగన్‌ దీక్ష
గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఇబ్బందులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రెండు రోజుల దీక్షకు పూనుకున్నారని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులంతా వలస కూలీలుగా మారుతున్నారన్నారు. అనేక మంది రైతు సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం దున్నపోతుపై వాన పడినట్లు ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లాలో 26, 27 తేదీల్లో వైయస్‌ జగన్‌ దీక్ష చేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు మూడేళ్లయినా ఆ ఊసే లేదన్నారు. రైతులను బలిపశువులను చేస్తూ వ్యాపారులకు రెడ్‌కార్పెట్‌ పరిచే విధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వైయస్‌ జగన్‌ దీక్ష చేస్తున్నారన్నారు.  రైతు సోదరులంతా రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
Back to Top