చంద్రబాబుకు మరణశిక్ష వేసినా తప్పులేదు

హైదరాబాద్, 1 డిసెంబర్ 2013:

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులను అడ్డుకోకపోవడం, మన రాష్ట్రంలో సక్రమ ప్రాజెక్టులు కట్టకపోవడం అనే రెండు పాపాలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఆరోపించారు. ఈ పాపాలు చేసిన ఆయనకు ప్రజలు ఏ శిక్ష వేసినా.. చివరికి మరణశిక్ష వేసినా తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణానది నీటి పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణమని గట్టు ‌ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇవాళ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు వచ్చి ఉండేవి కావా? చంద్రబాబూ అని ప్రశ్నించారు. చివరికి ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా మూలన పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పార్టీ కేంద్ర కార్యాయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో గట్టు ఎద్దేవా చేశారు.

తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి, పదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యవసాయం, నీళ్ళు, రైతులు అని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని గట్టు ఎద్దేవా చేశారు. చీడపురుగు పంటను కొరుక్కుని తిన్న చందంగా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. నీటిని, కరెంటును రైతు నుంచి దూరం చేసి వారి ఆత్మహత్యలకు కారణమైంది చంద్రబాబే అన్నారు. రైతు, వ్యవసాయం, ప్రాజెక్టులు, నీళ్ళు పదాలను మాట్లాడడమే అవమానంగా చంద్రబాబు భావించారని విమర్శించారు. అలాంటి చంద్రబాబు నాయుడు బ్రిజేష్‌కుమార్‌ తీర్పు కారణంగా రాష్ట్రానికి నష్టం వచ్చిందని కృష్ణానది నీటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ మీద ధర్నా చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబును చూసి కృష్ణమ్మ సిగ్గుతో తల వంచుకుంటుందన్నారు.

చంద్రబాబును చూడగానే అనావృష్టి, కరువు గుర్తుకు వస్తాయని, మహానేత వైయస్‌ను తలచుకుంటేనే వ్యవసాయం, ప్రాజెక్టులు, వర్షాలు, నీళ్ళు కళ్ళకు కనిపిస్తాయన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనే మన రాష్ట్రానికి ఒక మరణశాసనంగా మారిందని గట్టు ఆరోపించారు. కృష్ణానది నీటి పంపకాలపై బ్రిజేష్‌కుమార్‌ తీర్పు చంద్రబాబు నాయుడి పాపం అని ప్రజలు భావిస్తుంటే.. దానిని వైయస్ఆర్‌కు అంటగట్టాలని ఆయన చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు పాపాల పరిపాలన చూసి ఒక తొక్కు తొక్కితే అధఃపాతాళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు గుండెకాయ లాంటి వ్యవసాయాన్ని చంద్రబాబు దండగలా మార్చివేశారని దుయ్యబట్టారు.

బ్రిజేష్‌కుమార్‌ మధ్యంతర తీర్పు వచ్చినప్పుడే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ ఢిల్లీలో జలదీక్ష చేసిన వైనాన్ని గట్టు గుర్తుచేశారు. బచావత్‌ అవార్డు 1973 నుంచి 2003 వరకూ 30 ఏళ్ళు అమలులో ఉందని గట్టు తెలిపారు. బచావత్‌ అవార్డు సమయం పూర్తయ్యే సమయానికి పూర్తయిన ప్రాజెక్టులకే కాకుండా 75 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు కూడా తరువాత వచ్చే వచ్చే ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయాలన్న ప్రత్యేక అంశాన్ని పొందుపరిచిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.‌ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 2004 లోనే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వచ్చిన విషయం నిజం కాదా అని నిలదీశారు. తెలుగుగంగతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ బచావత్‌ అవార్డు గడువు ముగిసే లోగా పూర్తిచేసుకోవాలని ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆయన మాటలను తుంగలో తొక్కింది మీరు కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు.
ఎన్టీరామారావు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోకుండా విస్మరిస్తే.. వాటిని పూర్తిచేసింది మహానేత వైయస్‌ కాదా? అని గట్టు అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కడుతున్నానని హెలికాప్టర్‌లో వెళ్ళి ఫోజులిచ్చింది చంద్రబాబు కాదా అన్నారు.

చంద్రబాబు ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్లు‌ మాత్రమే ఖర్చు చేస్తే... మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి రూ.50వేల కోట్లు వ్యయం చేసిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. కుప్పంలో జనాన్ని తలుపులు మూసుకోమని చంద్రబాబు అంటే.. జనం ఆయన్నే నోరు మూసుకోమని శ్రీ జగన్‌ సమైక్య శంఖారావం సభకు హాజరవడం ద్వారా సమాధానం ఇచ్చారని గట్టు అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top