హైదరాబాద్ :
పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో విజయదుందుభి మోగించిందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపిలు రెండూ కలిసి పోటీచేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నిలువరించలేకపోయాయని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తొలి దశ పంచాయుతీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయుంలో మీడియూతో మాట్లాడారు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో నిర్బంధించటం మొదలు కాంగ్రెస్, టిడిపి నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మాత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆదరించి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్, టిడిపిల ప్రసార సాధనాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి చూపించేందుకు తప్పుడు ప్రచారం చేస్తూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయని గట్టు విమర్శించారు.
యెల్లో మీడియాలో భాగస్వామ్య చానల్ ఈటీవీ-2 పంచాయతీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ప్రారంభమైన పది నిముషాలకే ఫలితాలంటూ ప్రకటించటాన్ని బట్టి ఆ చానల్ డొల్లతనం బయటపడిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు కూడా తెలియని ఫలితాలు ఆ చానల్ ముందుగానే ప్రకటించటం ఆశ్చర్యకరం అన్నారు. ఫలితాల వెల్లడిలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయాలను స్వతంత్రుల జాబితాలో ఆ చానల్ చూపించిందని గట్టు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు చేసినట్లు అనేక రుజువులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. కొన్నిచోట్ల సిఎం కిరణ్ జోక్యం చేసుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై తప్పుడు కేసులు బనాయించటంతో పాటు కొందరిని హౌస్ అరెస్టు చేశారని దుయ్యబట్టారు.
ఆ రెండు పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఉప ఎన్నికల ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లోనూ పునారావృతం అయ్యాయని గట్టు రామచంద్రరావు అన్నారు. పార్టీ గుర్తుతో తొలుత నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసి పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించటంతోనే కుట్రకు బీజం వేశారన్నారు. వారి పథకాన్ని ప్రజలు పటాపంచలు చేశారని, పార్టీ రహితంగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లోనే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇక మీదట ప్రతి ఎన్నికలోనూ విజయ దుందుభి మోగించటం ఖాయమన్నారు.