టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీ అంటే తప్పేంటి?కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం చేజిక్కించుకున్న చంద్రబాబుహక్కులపై మాట్లాడకుండా చర్చకు దూరమైన టీడీపీ ఎంపీలుప్రజల పన్నులను ప్రాజెక్టుకు ఖర్చు చేస్తే సహించంపవిత్రమైన సోమవారాన్ని కమీషన్లు, కాంట్రాక్టుల వారంగా మార్చిన బాబువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజంహైదరాబాద్: విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తిపడి లాక్కున్న తెలుగుదేశం పార్టీని తెలుగు ద్రోహుల పార్టీ అనకూడదా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని శ్రీకాంత్‌రెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం సెక్షన్ 90లో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి ఇస్తుందని పొందుపర్చినట్లుగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రజల జీవనాడి అని, దాన్ని త్వరగా నిర్మింపజేసుకునేందుకు వైయస్సార్సీపీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. మధ్యలో చంద్రబాబు వచ్చి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును కమీషన్లు దండుకునేందుకు చేజిక్కించుకున్నాడని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ద్వంద్వ నాలుకల వైఖరిపై..తమకు మొదటి నుంచి అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రతిపక్షం అనుమానాలే నేడు నిజమయ్యాయన్నారు.
కెమెరాలకు కనిపించకుండా దాక్కున్న టీడీపీ ఎంపీలుప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులపై పెద్దల సభలో చర్చ జరుగుతుంటే చంద్రబాబు పార్టీ ఎంపీలు చర్చలో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2014 తరువాత పెరిగిన పోలవరం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం పెద్ద పిడుగును నెత్తిన వేసిందన్నారు. దీనిపై చర్చించకుండా కెమెరాలకు కూడా కనిపించకుండా టీడీపీ ఎంపీలు నక్కి నక్కి దాక్కుంటున్నారని విమర్శించారు. రాజ్యసభలో ఎందుకు ప్రజల గొంతు నొక్కుతున్నారని, వైయస్ జగన్‌పై ప్రతీ చిన్న విషయానికి బురదజల్లే ప్రయత్నం చేస్తున్న మీరు అతిముఖ్యమైన హోదా అంశంపై ఎందుకు మాట్లాడరని బాబు సర్కార్ ను నిలదీశారు. కేవలం కమీషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను తాకట్టుపెడతారా అని టీడీపీ ఎంపీలను ప్రశ్నించారు. కమీషన్ల కోసం రూ. 40 వేల కోట్లకు అంచనాలను పెంచారని మండిపడ్డారు. కేంద్రం మొత్తం నిధులు ఇస్తుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. 2014–15, 2015–16 బడ్జెట్లో కనీసం ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టుకు కేటాయించకపోవడంతో అనుమానం కలిగి ప్రతిపక్షం ప్రశ్నిస్తే....నాబార్డు ద్వారా నిధులు వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
పోలవరం పూర్తి చేయాలనే చిత్తశుద్ధి బాబుకు లేదురివ్యూ మీటింగ్‌లు పెట్టి సోమవారాన్ని పోలవరంగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు పవిత్రమైన సోమవారాన్ని కాంట్రాక్టుల వారం, కమీషన్ల వారంగా మార్చుకున్నాడని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రోజున కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుజనా చౌదరిలు పోలవరం ప్రాజెక్టు మొత్తం కేంద్రమే భరిస్తుందని చెప్పినట్లుగా గుర్తు చేశారు. మరి పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పకుండా కూర్చున్నారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు సర్కార్‌లో కనిపించడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డిజిల్, పెట్రోల్ మీద అధిక పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. అదే విధంగా విద్యుత్, బస్సు చార్జీలు పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని చంద్రబాబు ప్రజల పన్నులను పోలవరానికి ఖర్చు చేయాలని చూస్తున్నారన్నారు. పోలవరానికి ప్రజల పన్నులను వాడితే వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దివంగత మహానేత కలలు కని చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వైయస్ఆర్ సీపీ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరించారు.