రైల్వే జోన్ సాధించేవరకు పోరాటం ఆగదు

విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటం ఆగదని వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. గోకివాడలో గురువారం ఆయన ఓ ప్రైవేట్‌  కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  రైల్వే జోన్‌ సాధన కోసం ఈ నెల 22 నుంచి ఆత్మ గౌరవ యాత్ర పేరిట  తాను పాదయాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పాదయాత్రకు అందరూ మద్దతు పలకాలని కోరారు. విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.

బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రైల్వే జోన్‌ను తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు రైల్వే జోన్‌ హామీ ఇచ్చారని ఇప్పుడు అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. రైల్వే జోన్‌తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ నాయకులు నానేపల్లి సాయివరప్రసాద్, ద్వారపురెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top