దిక్కుతోచని స్థితిలో అన్నదాత

హుద్‌హుద్ దెబ్బకు విలవిల
రుణాలివ్వని బ్యాంకులు
పూర్తిగా అమలు కాని రుణమాఫీ
క్రమంగా తగ్గుతున్న రబీ సాగు విస్తీర్ణం


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్.. దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా కళ తప్పుతోంది. దేశానికి అన్నంపెట్టిన రైతన్న సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితిలో ఉన్నాడు. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపుఅప్పు ఇవ్వనని తెగేసిన చెప్పిన బ్యాంకులు, సరిగా అమలు కాని రుణమాఫీతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో పంటలు వేయవద్దని సర్కారు హుకూం జారీ చేయడంతో ఆ ప్రాంతంలో వేలాది ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయి. ఇలా ముప్పేట దాడితో రైతులంతా సాగు చేయలేని దుస్థితి నెలకొంది. సాధారణంగా రబీ కాలంలో వేసిన పంటలు ఇప్పటికే చేతికి వస్తాయి. కానీ ఫిబ్రవరి మొదటి వారం దాటుతున్నా ఇంకా పంట చేతికి రాకపోవడం రైతు గడ్డుస్థితిని తెలియజేస్తోంది.

తగ్గుతున్న సాగు విస్తీర్ణం

రాష్ట్రంలో ఈ దఫా సాగు విస్తీర్ణం ఆందోళన కలిగిస్తోంది. రబీపంటలు సాగయ్యే 25.89 లక్షల హెక్టార్లకుగాను ఇప్పటివరకు 21 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్టు వ్యవసాయ శాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇప్పటికే 24.12 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. ప్రైవేటు సంస్థల సమాచారం ప్రకారం ఫిబ్రవరి తొలివారం నాటికి 18 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలించక భూగర్భ జలాలు అడుగంటడం, రిజర్వాయర్ల నుంచి నీరు విడుదలయ్యే పరిస్థితి లేకపోవడంతో రైతులు అదునులో పంటు వేయలేకపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పంటలు వాడిపోతున్నాయి. పత్తి, పొద్దు తిరుగుడు, కంది, రాగి, మొక్కజొన్న నూగు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం చాలా చోట్ల మిర్చి పంటకల్లాల్లో ఉంది. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పత్తితీతలు ఊపందుకున్నాయి. చెరకుకొట్టుడు కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. రెండో పంటకు నీళ్లిస్తారన్న ఆశతో కోస్తా జిల్లాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయాల్లో నీళ్లు అడుగంటుడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఇబ్బంది పెడుతున్న వర్షాభావ పరిస్థితులు..
రాష్ట్రంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. 13 జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది.
రాష్ట్రంలో జూన్ 1 నాటి నుంచి ఇప్పటి వరకు కురావాల్సిన వర్షపాతం 855.3 మిల్లీమీటర్లు కాగా, 549.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదైంది.

జిల్లాల వారిగా నమోదైన లోటు వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..
 శ్రీకాకుళంలో 10.7 శాతం
 విజయనగరంలో 4.9 శాతం
 విశాఖలో 19.4 శాతం
 తూర్పుగోదావరిలో అత్యధికంగా 49.8
 పశ్చిమగోదావరిలో 44.7
 కృష్ణాలో 41.7
 గుంటూరులో 39.2
 ప్రకాశంలో 46.6
 నెల్లూరు 45.2
 చిత్తూరు 46.2
 కడప 49.4
 అనంతపురం 44.5
 కర్నూలు 32.8
 ఆందోళనకరంగా భూగర్జ జలాలు

విశాఖపట్నం జిల్లాలో ఇదీ పరిస్థితి..!
జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 1.35 లక్షల ఎకరాలు. వీటిలో 35వేల ఎకరాల్లో వరి సాగవుతుంటే, 70వేల ఎకరాల్లో అపరాలు, 10వేల ఎకరాల్లో వేరుశనగ, 10వేల ఎకరాల్లో మొక్క జొన్న, 5వేల ఎకరాల్లో నువ్వులు సాగవుతుంటాయి. మరో ఐదారువేల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తుంటారు. ఏటా సుమారు 50వేల మందికి పైగా రైతులు రెండో పంట వేస్తుంటారు.

సీజన్ ముగుస్తున్నా...
సాధారణంగా అక్టోబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే రబీ సీజన్ ఫిబ్రవరితో ముగుస్తుంది. వరి అయితే డిసెంబర్‌లో నారుమళ్లు పోసి జనవరిలో ఊడుస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా కనీసం 30 శాతం వరి ఊడ్పులు కూడా పూర్తి కాలేదు. అపరాల మాత్రమే 65 శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఇక ఇతర పంటలసాగు ఎక్కడా కనిపించడం లేదు. రబీలో 35 వేల ఎకరాలకు పైగా వరిసాగవ్వాల్సి ఉండగా ప్రస్తుతం అతికష్టమ్మీద 10వేల ఎకరాలు కూడా దాటలేదు.
ఇక అపరాలైతే 70వేల ఎకరాలకు 40వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి. మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు పంటలైతే రబీ సీజన్‌లో 40వేల ఎకరాలకు 15వేల ఎకరాలకు మించలేదు. మొత్తంమీద లక్షా 25 వేల ఎకరాలకు 65వేల ఎకరాలకు మించి రబీ సాగు జరగడం లేదు. ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విద్యుత్ సరఫరా లేకే..
జిల్లాలో 20 వేలకు పైగా ఇరిగేషన్ బోర్‌వెల్స్ ఉన్నాయి. వీటి కిందే ఏకంగా లక్ష ఎకరాల వరకు సాగవుతుంటుంది. హుద్‌హుద్ తుపాన్ కారణంగా జనవరి వరకు వీటికి విద్యుత్ పునరుద్ధరించలేదు. దీంతో వీటి కింద సాగయ్యే ఆయకట్టు ప్రస్తుతం రెండవ పంటసాగుకు దూరమైపోయింది. మరో పక్క అక్టోబర్ తర్వాత కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. రెండవ పంట పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. మిగులు నీరు ఉంటేనే రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు అనుమతిస్తారు.

ముఖం చాటేసిన బ్యాంకర్లు
ఒక పక్క హుద్‌హుద్ దెబ్బకు గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్ డ్యామ్‌లు, కాలువలు, చెరువుల గట్లు దెబ్బతినడంతో రబీసాగుకు సరిపడా నీటి నిల్వలు నిండుకున్నాయి. మరో వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా రుణమాఫీ పుణ్యమాని బ్యాంకర్లు పూర్తిగా ముఖం చాటేయడంతో అప్పుపుట్టడం లేదు. దీంతో రబీ సాగుకు దూరంగా ఉండడమే మేలని మెజార్టీ రైతులు నిర్ణయించుకున్నారు.
Back to Top