'రైతన్న రెక్కల కష్టానికి చేయూత కరవు'

మాడుగుల (విశాఖ జిల్లా) :

కష్టపడి పండించిన కష్టానికి ప్రభుత్వం చేయూత కరవై తమ బతుకులు కష్టంగా మారాయని రైతులు శ్రీమతి షర్మిల ముందు వాపోయారు. మరో ప్రజాప్రస్థానంలో తమ గ్రామానికి వస్తున్న శ్రీమతి షర్మిలకు అడుగడుగునా ఆయా గ్రామాల రైతులు తమ గోడును వినిపిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని కె. సంతపాలెం పరిసర ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో కర్రపెండలం పండుతోంది. పది నెలల్లో చేతికొచ్చే ఈ పంటకు వర్షమే ఆధారం. మెట్టభూముల్లో దీనిని పండించేందుకు అనేక కష్టాలు పడాల్సివస్తోంది. బోర్లలోని నీళ్ళు పైకి అందడం లేదు. గిట్టుబాటు ధర రావడం లేదు అంటూ స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రపెండలం దుంపను శ్రీమతి షర్మిలకు చూపించారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని, సగ్గుబియ్యం తయారీకి ఉపయోగించే ఈ పంటకు తమ ప్రాంతంలో కర్మాగారాలు లేక ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళాల్సి వస్తోందన్నారు. దీనితో రవాణా భారంగా మారుతోందని రైతులు వాపోయారు. పచ్చి దుంపను విక్రయిస్తే ఖర్చులు పోగా ఏటా ఐదారు వేలు కంటే ఎక్కువ మిగలడం లేదని బర్ల అర్జున, సర్వసిద్ధి అప్పలనాయుడు, సన్యాసమ్మ, బొడ్డు ఈశ్వరరావు అనే రైతులు చెప్పారు.

కూర'గాయాలు' తప్పడం లేదు:
కె.సంతపాలెంలో కూరగాయల రైతులు కూడా శ్రీమతి షర్మిలకు తమ కష్టాలు వివరించారు. దళారుల వల్ల నష్టపోతున్నామని కోల్డు స్టోరేజీలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. పెట్టుబడులు పెరిగిపోయాయంటూ మహిళా రైతులు శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని శ్రీమతి షర్మిల అన్నారు. రామచంద్రాపురంలోని ఎస్సీ కాలనీ వాసులు తమకు గుక్కెడు మంచినీరు కూడా దొరకడం లేదని వాపోయారు. గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానిక నాయకులకు శ్రీమతి షర్మిల సూచించారు.

Back to Top