కృష్ణాః కాల్ మనీ వ్యవహారంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రధాన పాత్ర ఉన్నందునే వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను అన్నారు. ప్రధాన సూత్రధారులు బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగేశ్వరరావు, వెనిగళ్ల శ్రీకాంత్ సహా మరికొందరినీ తప్పించేందుకు...చంద్రబాబు నిజాయితీ పరుడైన నగర సీపీపై ఒత్తిళ్లు తీసుకొచ్చారని మండిపడ్డారు.
బోడే ప్రసాద్, వెనిగళ్ల శ్రీకాంత్ విదేశాల్లో పక్కపక్కనే ఉన్న విషయం బహిర్గతమైందని, వాళ్ల ట్రావెల్ టికెట్లు గమనిస్తే నిజాలు బయటపడతాయన్నారు. బుద్దా వెంకన్న నాకేం సంబంధం లేదని మాట్లాడడం దారుణమన్నారు. బుద్దా వెంకన్న ఆయన సోదరుడు బుద్దానాగేశ్వరరావుల కాల్ మనీ వ్యవహారం గురించి విజయవాడ వన్ టౌన్ లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
బుద్దా వెంకన్న కనకదుర్గ గుడిమీద షాపులు పెట్టి కోట్లకు పడగలెత్తాడని సామినేని తెలిపారు. బోడే ప్రసాద్ శాసనసభ్యుడిగా అర్హుడే కాదన్నారు. ఆయన పేరుతో ఇంటర్ పరీక్షలు రాస్తూ ఓ విద్యార్థి పట్టుబడిన విషయం అందరికే తెలిసిందేనన్నారు. బోడే ప్రసాద్ పై కేసు నమోదైనా ఇంతవరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. మహిళా అధికారిణిని కొట్టిన చింతమనేని ప్రభాకర్ పైనా, బోడే ప్రసాద్ పైనా ఆరోజే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇవాళ ఈపరిస్థితి ఉండేది కాదన్నారు.