ఎవరో చేసిన పాపాలను వైయస్‌పై వేశారు

భువనగిరి (నల్లగొండ జిల్లా), 30 అక్టోబర్‌ 2012: ఎవరో చేసిన పాపాలను దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిపైన వేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సహించరాని విషయమని ఆయన ఖండించారు.‌ యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చే‌రిన సందర్భంగా భువనగిరిలో సోమవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీయే అధికారంలోకి రావడం తథ్యమని ఉప్పునూతల చెప్పారు. భువనగిరి చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాలలోను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందన్న ధీమాను ఉప్పునూతల వ్యక్తం చేశారు.
భువనగిరికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రావడం చాలా కాలం తరవాత తమకో పండగ అని ఉప్పునూతల అభివర్ణించారు. విజయదశమి పండగ పోయి నాలుగురోజులైందని, విజయలక్ష్మి వచ్చి విజయదశమి పండుగను సంపూర్తి చేశారని అన్నారు. ఈ పండగ దేని కోసం? రాజశేఖరరెడ్డిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ముద్దుబిడ్డ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని పులివెందుల పులిబిడ్డ అంటారు గానీ అప్పుడు పులి రాజశేఖరరెడ్డి అన్నారు. బిడ్డ జగన్ ఇప్పుడు వచ్చా‌రన్నారు.
భువనగిరి చరిత్ర మనలో చాలా మందికి తెలియదని పురుషోత్తమరెడ్డి అన్నారు. భువనగిరి పుట్టినప్పటి నుంచే మనకు ఎన్నికలు వచ్చినప్పటి నుంచే భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది ఈ నియోజకవర్గమే అన్నారు. దేశం మొత్తం మీద ఎన్నికలలో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో భువనగిరి నియోజకవర్గ ఓటర్లు రావి నారాయణరెడ్డిని గెలిచింపిన విషయాన్ని ఉప్పునూతల గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్‌ రెడ్డి కూడా కడపలో 5,40,000 మెజారిటీతో గెలిచారన్నారు. ఇంతవరకూ ఇదే ప్రపంచ రికార్డు అన్నారు.
తన కంటే కొడుకు ఘనుడు కావాలని ఏ తండ్రి అయినా అనుకుంటారన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ కాలం నాటి నుంచీ తాను వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూశానన్నారు. అనేకసార్లు తాను వారి ఇంటికి వెళ్ళానని, ఆయనా తమ ఇంటికి వచ్చారని అన్నారు. అయితే, వైయస్ మరణించే వరకూ ఏనాడూ జగన్మోహన్‌రెడ్డిని చూడలేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top