ఎనిమిది నెలల జైలు హక్కుల ఉల్లంఘనే

న్యూయార్కు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించారంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. కడప ఎంపీ కూడా అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎనిమిది నెలలుగా జైలులో అక్రమంగా నిర్బంధించడం హక్కుల ఉల్లంఘనే అవుతుందని మానవ హక్కుల పరిశీలకుడు ఎమ్. తమీమ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని, హక్కుల ఉల్లంఘనను అడ్డుకోవాలని కోరుతూ అంతర్జాతీయ మానవహక్కుల హైకమిషన్ నవనీతం పిళ్ళైకి ఆయన ఆంధ్ర ప్రదేశ్ పరిశీలకుల తరఫున ఇటీవల వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర మానవ హక్కుల పరిశీలకుల సంస్థ అధ్యక్షుడిగా ఉన్న తమీమ్ ఐక్య రాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలిలో కూడా సభ్యులు. మానవ హక్కుల పరిశీలకుల సంఘం ఐక్య రాజ్య సమితికీ, అంతర్జాతీయ బార్ అసోసియేషనుకు అనుబంధంగా పనిచేస్తోంది. మాన హక్కుల డిప్యూటీ హై కమిషనర్ క్యుంగ్ వా కాంగ్, అసి ఇవాన్ సిమనోవిక్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు కిమ్ వాన్ సూ లకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను వివరించినట్లు తమీమ్ ఒక ప్రకటనలో వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడైన శ్రీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడం కోసం కుట్ర పన్ని జైలు పాలుచేశారని, ఆయనకు బెయిలు రాకుండా ఇబ్బందులు పెడుతున్నారనీ ఆ వినతిత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఎనిమిదినెలలపాటు విచారణ చేయకుండా ఒక వ్యక్తిని జైలులో నిర్బంధించడాన్ని సమర్థించుకునేందుకు సీబీఐ వద్ద ఎలాంటి సమాధానం లేదని చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు నిరూపించేందుకు సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. తొంబై రోజులు మించి ఎవర్నీ నిర్బంధించరాదని చట్టం చెబుతున్నప్పటికీ ఆయన బెయిలును అడ్డకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైయస్ఆర్ కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తోందని పేర్కొన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అక్రమమంటూ సుమారు రెండు కోట్ల మంది సంతకాలు చేసి, రాష్ట్రపతికి పంపించిన అంశాన్ని కూడా ఆయన వినతి పత్రంలో ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల పరిశీలకులు సర్వే నిర్వహించి, శ్రీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకున్నట్లు నిర్థారించుకున్నారని తమీమ్ వెల్లడించారు. కోట్లాదిమంది మద్దతు పలుకుతున్న యువనాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేకూరకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తే అవకాశముందనీ, వాటివల్ల శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందనీ తెలిపామన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్న సందేశం పంపించాలని హైకమిషనరుకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్ని సవాళ్ళు ఎదురైనా భారత న్యాయమూర్తులు నిష్పాక్షికంగా తీర్పులిచ్చి న్యాయం పట్ల తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకున్నారని పేర్కొంటూ, శ్రీ జగన్మోహన్ రెడ్డి హక్కులను రక్షించే అంశంలో నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో హైకమిషనరును కోరారు.

తాజా ఫోటోలు

Back to Top