గంటా ఇంటి ముట్టడి

విశాఖ: విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముందు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బదిలీలు, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. విద్యాశాఖమంత్రి డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా మంత్రి గంటా తప్పించుకొని తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2015లో ప్రభుత్వం వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తే సంఘాలన్నీ అంగీకరించాయని, వెబ్‌ కౌన్సిలింగ్‌ ఆప్షన్స్‌ పెట్టుకోవడం చాలా ఇబ్బండిగా ఉందని చెబితే, రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నిలబెట్టుకోలేదన్నారు. పర్ఫామెన్స్‌ పాయింట్‌లలో అక్రమాలకు దారి తీయడంతో వాటిని కూడా రద్దు చేయాలని కోరినా, మరో రూపంలో తీసుకొచ్చారన్నారు. బదిలీలు ఇస్తూ రూ. లక్షలు, లక్షలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. మంత్రిగా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే వెంటనే రాజనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారు.

Back to Top