ఎలాంటి ఒప్పందంలేదు:ఎంపీ మేకపాటి

బాబు మాటలకు విశ్వసనీయత లేదు
జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకనే గోబెల్స్ ప్రచారం
తెలంగాణలోనూ బలమైన శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్

రాష్ట్రపతి అభ్యర్థిత్వంలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతుగా ఓటు వేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఏ పార్టీతోనూ ఎలాంటి లోపాయికారీ ఒప్పందం చేసుకోలేదని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశప్రయోజనాలతోపాటు రాష్ట్రపతిగా ప్రణబ్ అన్ని విధాల తగిన వారనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఆ నిర్ణయం తీసుకుందే తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని, లేనిపక్షంలో ఆరోపణలు చేస్తున్నవారు శిక్షకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలపాలని సవాలు విసిరారు. లోటస్‌పాండ్‌లో గురువారం మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ... ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా మాట్లాడించగలరు. అందుకే ఆయన మాటల పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేదు. దానికి కొనసాగింపుగా ప్రతిరోజూ తన మనషుల చేత గోబెల్స్ ప్రచారం చేయిస్తుంటారు’’ అని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్, జగన్‌ను ఎదుర్కొనే శక్తిలేకనే రకరకాలుగా మాట్లాడుతున్నారని, ప్రణబ్‌కు మద్దతు తెలపడంలో తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా చానళ్లు పెడర్థాలు తీస్తున్నాయని, అది సరైందికాదని చెప్పారు. ‘‘పాపం రాష్ట్రంలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిలో ఉందని చెప్పా. దీనికి కూడా పెడర్థాలు తీస్తున్నారు. పాపం అనే పదాన్ని నేను ఊతపదంగా వాడతా. రాష్ట్రంలో టీడీపీ మరింత దయనీయ పరిస్థితిలో ఉందని చెప్పాను. అయితే దానికి కూడా అలా చెడుగా చెప్పాలా? రాజకీయాల్లో కాస్త విశ్వసనీయతను ఉంచండి. చేతనైతే మేం చెప్పింది చెప్పినట్లుగా ప్రసారం చేయండి. అదే విధంగా ప్రజల్లో మీడియాకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు’’ అని హితబోధ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, దయనీయ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలతో మిలాఖత్ కావాల్సిన అవ సరం తమకు లేదని తెలిపారు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరిదో ప్రజలకు తెలుసు

రాష్ట్రం రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదెవరో ప్రజలకు బాగా తెలుసునని మేకపాటి చెప్పారు. ‘‘స్థానిక సంస్థల ఎమ్మెల్సీలనుంచి నిన్నటి ఉప ఎన్నికల పోరు దాకా ఎవరు... ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారో అందరికీ తెలుసు. అవిశ్వాసం కూడా సరైన సమయంలో పెట్టుంటే ప్రభుత్వం పడిపోతుందనే ఉద్దేశంతో కొంతకాలం మిన్నకుండిపోయిన చంద్రబాబు, కాంగ్రెస్ సేఫ్ జోన్‌లోకి చేరుకున్నాకనే పెట్టారు. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ మా ఎమ్మెల్యేలు మద్దతిచ్చి పదవులు కోల్పోయారు. అయినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో ఊహకందని మెజార్టీతో గెలుపొందారు’’ అని చెప్పారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదిగి టీఆర్‌ఎస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి చెక్ పెడుతుండటంవల్లనే ఆ పార్టీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలు ఏకమై జగన్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. కానీ రాష్ట్ర ప్రజలు జగన్‌ను చాలా గొప్పగా విశ్వసిస్తున్నారని, కనుక తాము ఎవరితో కుమ్మక్కు కావాల్సిన ఖర్మలేదని ఆయన స్పష్టం చేశారు.

Back to Top