విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

శ్రీకాకుళం అర్బన్‌: విద్యారంగాన్ని గాలకొదిలేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగంపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫ్యాఫ్టో–జాక్టో ఉద్యమ సంఘాల సారథ్యంలో బుధవారం నిర్వహించిన డీఈవో కార్యాలయాల ముట్టడి న్యాయబద్ధమేనన్నారు. అన్ని సంఘాల ఉపాధ్యాయులకు వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. విద్యాహక్కును అపహాస్యం చేస్తూ నూతన విద్యా విధానం పేరుతో సర్కారీ బడులు మూసివేయించేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలు మూసివేయించి కార్పోరేట్‌ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణ ముందు మోకరిల్లడానికి ప్రభుత్వం మొగ్గుచూపుతోందని దుయ్యబట్టారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని, ప్రతిభ ఆధారిత పాయింట్లను, సీపీఎస్‌ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యజ్జల గురుమూర్తి, రొక్కం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top