'దుబాయి' తెలుగువారి రక్షణకు కట్టుబడ్డాం

హైదరాబాద్, 18 మే 2013:

దుబాయిలో ఉన్న తెలుగువారి రక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ కరీంనగర్ జిల్లా నేత కె.కె. మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. రాజకీయాలను రాజకీయ కోణంతోనూ, మానవతాదృక్పథానికి సంబంధించిన అంశాలను మానవీయ విలువలతోనూ చూడాలని ఆయన  విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు ఓ మీడియా అనే సంస్థ రూ.  15 లక్షలు అందించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా ఆయన పేర్కొన్నారు.  వారి విడుదలకు సంబంధించిన ప్రక్రియను తమ పార్టీ మొదలుపెట్టకుండా ఉంటే వారు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి ఉండేవారు కాబట్టే తమ విజయమని చెబుతున్నామని వివరించారు. మిగిలిన పనిని పూర్తి చేయని పక్షంలో అందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. ఈ ఒక్క అంశంలోనే కాకుండా మిగిలిన అంశాలలో కూడా స్పందించాలని ఆయన కోరారు. దీని పై కేకే మహేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం పూర్తిపాఠం...  

బతుకు తెరువు కోసం దుబాయి వెళ్ళిన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక కేసులో ఇరుక్కుని 24 సంవత్సరాల జీవిత ఖైదును అనుభవిస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికి ఏడేళ్ళుగా వారు దుబాయి  జైల్లో ఉన్నారని తెలిపారు. అక్కడి చట్టం ప్రకారం హత్యకు గురయిన వ్యక్తి కుటుంబీకులు క్షమాభిక్షకు అంగీకరిస్తే వీరు విడుదలవుతారని చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారన్నారు. మూత్రపిండాలైనా అమ్ముకుని ఆ డబ్బుతో తమ వారిని విడిపించుకుంటామని వేడుకున్నారన్నారు. ఈ అంశాన్ని తెలుసుకున్న తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుంటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించారన్నారు. ఈ తరుణంలో ఖైదీల కుటుంబ సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలిని కలిశారని కేకే చెప్పారు. మూత్రపిండాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదనీ, 15 లక్షల రూపాయలనూ తాము ఇస్తామనీ విజయమ్మగారు వారికి హామీ ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవాసాంధ్ర విభాగం కన్వీనర్ వెంకట్ మేడపాటితో కలిసి దుబాయి వెళ్ళి ఖైదీలను, ఇండియన్ అంబాసిడర్‌ను కలిసినట్లు తెలిపారు.  మొదటి నుంచి ఈ కేసును చూస్తున్న అడ్వొకేటు అనురాధ నుంచి సంబంధిత పత్రాలను కూడా సేకరించినట్లు చెప్పారు. తదనంతరం, ఈనెల 8న నేపాల్ వెళ్ళి మృతుడి భార్యను కలిశామన్నారు. ఆమెను ఖాట్మండుకు తీసుకువచ్చి, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా మోఘా అనే సర్టిఫికెటును తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించి మృతుని కుటుంబం అంగీకరించిన మొత్తాన్ని అతడి భార్యకు చెల్లించామని చెప్పారు. ఆ సర్టిఫికెట్లను ఇండియన్ ఎంబసీలో సర్టిఫై చేయించుకుని ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూశామన్నారు. దీనికి సంబంధించి దుబాయి కోర్టులో కేసును తిరిగి తెరవడానికి అన్ని చర్యలూ చేపట్టామన్నారు.

ఈ వ్యవహారానికి కొన్నేళ్ళ ముందు ఓ మీడియా  సంస్థ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అవసరమైన సొమ్మును ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీని  మరిచిపోయిందనీ, ఈ అంశాన్ని తాము చేపట్టి ఇంతవరకూ తెచ్చిన తర్వాత  ఆ మీడియా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు రూ. 15 లక్షల రూపాయల చెక్కులను అందించిందనీ దీనిని తాము అభినందిస్తున్నామనీ కేకే చెప్పారు. ఆ కుటుంబాలకు మేలు చేకూరాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం చెక్కులిచ్చి చేతులు దులుపుకోవద్దని కేకే మహేందర్ రెడ్డి ఆయనకు విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాల వారు అమాయకులూ, అక్షర జ్ఞానం లేని వారూ అని గమనించాలన్నారు. ఆ మొత్తంతో  అన్ని పనులూ జరగవన్న విషయాన్ని వారు గుర్తించాలన్నారు. దుబాయి చట్టాల ప్రకారం జరగాల్సిన మిగిలిన ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆయన కోరారు.

సౌదీ అరేబియాలో జూలై 3వ తేదీలోపు ఇటువంటి అంశాలేమైనా ఉంటే పూర్తిచేయాలన్నారు. ఎందుకంటే అక్కడ నితాఖత్ అమలులోకి వచ్చిందంటే సమస్యల పరిష్కారం కష్టతరమవుతుందనే అంశాన్ని గుర్తించాలని సూచించారు. టీఆర్ఎస్ కానీ, ఏదైన సంస్థ ద్వారా గానీ ఎలాగైనా సరే ఇటువంటి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. మీరు ఎప్పుడు విఫలమైనా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు.

Back to Top