జేసీని అరెస్టు చేసే దమ్ముందా

– 11 మందిని బలిగొన్నా వెనకేసుకొస్తావా..?
– సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదా..?
– వైయస్‌ జగన్‌ హెచ్చరించకుంటే కలెక్టర్‌ జైలుకెళ్లేవాడు
– అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారం నడుచుకోవాలి
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 

హైదరాబాద్‌: 11 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి ప్రధాన కారకుడైన దివాకర్‌ ట్రావెల్స్‌ యజమాని జేసీ దివాకర్‌ రెడ్డిని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకుందా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ చేశారు. కొంతమంది ఐఏఎస్‌ల వెనుకుండి చంద్రబాబు ధర్నాలు చే యిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నించడం దౌర్భాగ్యమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో పలు ధర్నాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన భాషను ఆయన ప్రస్తావించారు. ఉద్యోగాలు పీకిస్తా.. తాట తీసేస్తా.. అని పరుషంగా మాట్లాడిన మాటలను ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఈ ఐఏఎస్‌లు ఎక్కడికి పోయారని అంబటి ప్రశ్నించారు. 

వైయస్‌ జగన్‌ మాట్లాడింది కరక్టే
దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కలెక్టర్‌తో ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ అన్న ‘జైలుకు పోతావ్‌’ అన్న మాటలకు మేం కట్టుబడే ఉన్నామని అంబటి మరోసారి స్పష్టం చేశారు. డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా వదిలేస్తే కలెక్టర్‌ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారని అంబటి అన్నారు. దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఐఏఎస్‌ల సంఘం ధర్నా చేసిందన్నారు. ఇది కూడా చంద్రబాబు చేయించిందే తప్ప వారికై వారు చేసింది ఎంతమాత్రం కాదని అంబటి ఆరోపించారు. గతంలో పలు సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు వాడిన భాష బాగుందా..? అని ఎద్దేవా చేశారు. తాట తీస్తా అన్నప్పుడు ఏమై పోయారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రొటోకాల్‌ను అనుసరించి నడుచుకుంటే నడుచుకోవాలని హితవు పలికారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ హెచ్చిరించి డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించకుండా ఉండుంటే కలెక్టర్‌ జైలుకు వెళ్లిం ఉండేవాడని అంబటి అన్నారు. ఈ సంగతి కలెక్టర్, ఐఏఎస్‌లకు తెలియకపోవడం బాధాకరమన్నారు. 

పక్కదోవ పట్టించేందుకే కేసులు
బస్సు ప్రమాద ఘటనను పక్కదోవ పట్టించేందుకే ప్రతిపక్ష నాయకుడిపై కేసులు నమోదు చేశారని అంబటి ఆరోపించారు. ప్రమాద బాధితులను పరామర్శించడం ఇప్పుడేమీ కొత్త కాకపోయినా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ కావడమే కారణమన్నారు. ఇంత విషాదం జరిగి 11 మంది మరణిస్తే మీడియా కూడా వైయస్‌ జగన్‌పై కేసుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు.. కారకులను కనిపెట్టి శిక్ష పడేలా చేయాలని దానికి అనుగుణంగా కథనాలు రాయాలని హితవు పలికారు. ఇంత భారీ ప్రమాదాన్ని.. భారీ ప్రాణ నష్టాన్ని కప్పి పెట్టే కుట్రజరిగిందని అంబటి ఆరోపించారు. వైయస్‌ జగన్‌ వచ్చే సమయానికే మృతదేహాలను తరలించేస్తున్నారని పేర్కొన్నారు. డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే తరలించే కుట్ర పన్నారని.. దానినే వైయస్‌ జగన్‌ ప్రశ్నించారని వెల్లడించారు. ఐటీసీ 202 ప్రకారం సాక్ష్యాలను మాఫీ చేస్తే జైలుకెళ్తారని.. వైయస్‌ జగన్‌ కూడా అదే చెప్పారని అంబటి గుర్తుచేశారు. గతంలోనూ నిజామాబాద్‌ కలెక్టర్‌ అశోక్‌ కుమార్‌ కూడా వైయస్‌ఆర్‌ పాదయాత్రకు వస్తే ప్రొటోకాల్‌ పాటించిన సంగతిని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడికి సమాధానం చెప్పాల్సిన కలెక్టర్‌ సాక్ష్యాలను మాయం చేసే కుట్ర పన్నారని అంబటి స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top