బొత్స, ఉండవల్లికి కృతజ్ఞత ఉందా!

విజయనగరం 13 జూలై 2013:

ఎవరైనా సరే చేసిన మేలు మరవకూడదు. బొత్స సత్యనారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వీరిద్దరికీ కృతజ్ఞత లేదు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ వారిద్దరికీ ఎంత మేలు చేశారో వారికే తెలుసు. అయినా వారికి ఏమీ గుర్తుండదు' అంటూ శ్రీమతి వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. ‘బొత్సగారి కుటుంబానికి మహానేత ఎంత మేలు చేశారో, ఆయన కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారో అందరికీ తెలుసు. కానీ సత్తిబాబు గారికి ఆ కృతజ్ఞత లేదు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారికైతే ఎంపీగా గెలుస్తారని ఆయనకే నమ్మకం లేదు. కానీ, ఉండవల్లి గారిని మహానేత రెండుసార్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆయన శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి మీద విషం కక్కుతున్నారు. మనిషి అన్న తరువాత కృతజ్ఞత ఉండాలి. విలువలు, విశ్వాసం, విశ్వనీయత ఉండాలి. ఇవి లేకపోతే మనిషికి, మృగానికి తేడా లేదు’ అని శ్రీమతి వైయస్ షర్మిల ఘాటుగా విమర్శించారు.
ఇటీవల రాజమండ్రిలో సభ పెట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఇష్టానుసారం విమర్శించారని చెప్పారు. డాక్టర్  వైయస్ఆర్,  శ్రీ జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగారి గురించి నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. ఆయన మీద ఏ విమర్శా చేయలేదన్నారు. మహానేత ప్రవేశపెట్టిన మంచి పథకాలకు తూట్లు పొడుస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిగారి మీద కూడా ఎంపీ హోదాలో ఈ ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు ఏ విమర్శలూ చేయలేదన్నారు. సీబీఐ కాంగ్రెస్ పెరట్లో కుక్కనీ, కాంగ్రెస్ పంజరంలో చిలుక అని మన దేశంలోనే బొగ్గు కుంభకోణం కేసుతో సహా మొన్న రైల్వేమంత్రి బన్సల్‌గారి కేసు వరకు రుజువైన విషయాలను కూడా ఉండవల్లిగారు ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి గారి మీద మాత్రం విషంగక్కారని ఆవేదన వ్యక్తంచేశారు. మిగతా వాళ్లను ఎందుకు విమర్శించలేదు ఉండవల్లిగారూ అని అడిగితే.. ‘నా పక్కన ఉన్నాయనకు ట్రైన్ టైం అయిపోయింది. అందుకే బాబును విమర్శించలేదు. నా కింద కూర్చున్నాయనకు చాయ్ టైం అయింది. అందుకే టీడీపీని విమర్శించలేదు’ అంటూ సమాధానం చెప్పారన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన వైయస్ఆర్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే కళ్లప్పగించి చూశారని ధ్వజమెత్తారు. ఈ రోజేమో వైఎస్సార్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు.

డాక్టర్ వైయస్ఆర్, శ్రీ జగన్మోహన్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారు కాబట్టే సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని బొత్స చెబుతున్నారన్నారు. శ్రీ జగన్‌మోహన్‌రెడ్డిగారు దోషిగా జైల్లో లేరన్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న సీబీఐ అనే కీలుబొమ్మ.. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే, విచారణ జరపడానికి ఇంకా సమయం కావాలని ఆ సంస్థ అడిగితే కోర్టు సమయం ఇచ్చిందన్నారు. అంతేతప్ప జగనన్న మీద ఇంకా విచారణే మొదలుకాని విషయాన్ని గమనించాలన్నారు. ట్రయల్ కూడా ప్రారంభం కాకపోతే ఏ కోర్టైనా జగన్మోహన్‌ రెడ్డి గారిని ఎలా దోషి అంటుందనే ఇంగితం కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ కేసులు వేసింది ప్రజలు కాదు. మీ పార్టీకే చెందిన శంకర్రావు అనే వ్యక్తి. ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇది క్విడ్ ప్రోకో కాదా అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

Back to Top