ధర్నాలతో దద్దరిల్లిన విద్యుత్‌ ఉపకేంద్రాలు

హైదరాబా‌ద్, 9 జనవరి 2013: కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల‌పై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనల వేడిని మరింత పెంచింది. ఈ క్రమంలో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన నిర్ణయంపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. విద్యుత్ చార్జీలను ఇష్టం వచ్చినట్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ‌చేస్తున్న ఆందోళనలతో విద్యుత్‌ ఉప కేంద్రాలు దద్దరిల్లిపోయాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న విద్యుత్ స‌బ్‌ స్టేషన్ల ముందు వైయస్ఆర్‌సిపి బుధవారం ధర్నాలు నిర్వహించింది. కర్నూలులోని బళ్ళారి చౌరస్తాలో ఉన్న విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాకు వైయస్ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నాయకత్వం వహించారు.

అయితే, హైదరాబాద్‌ సహా పలు పట్టణాల్లో శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తున్న వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ వద్ద భారీ స్థాయిలో నిర్వహించిన ఆందోళనలో పార్టీ నాయకులు గట్టు రామచంద్రరావు, హెచ్‌ఎ రెహ్మాన్‌, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు, విశేష సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంధన సర్దుబాటు పేరిట కిరణ్‌ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా వినియోగదారులపై పెనుభారం మోపుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది. తాజాగా ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీల పెంపునకు కాంగ్రె‌స్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని వై‌యస్‌ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సబ్ స్టేష‌న్ ఎదుట పార్టీ నాయకులు, శ్రేణులు ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం సబ్ స్టేష‌న్ వద్ద రైతులతో కలసి పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ స‌బ్ స్టేష‌న్, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడురు స‌బ్ స్టేష‌న్, మహబూ‌బ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న స‌బ్ స్టేషన్ల ఎదుట ఆందోళన‌ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ సబ్ స్టేష‌న్, నిజామాబా‌ద్ జిల్లా ఆర్మూ‌ర్ మండలం పెర్కి‌ట్ స‌బ్ స్టేష‌న్, గుంటూరు జిల్లా పొన్నూరు విద్యు‌త్ స‌బ్ స్టేష‌న్ వద్ద వైయ‌స్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తు ధర్నాలో పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, మెద‌క్ జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట స‌బ్ స్టేష‌న్ల ఎదుట పార్టీ భారీ ఎత్తున ధర్నా చేసింది. విద్యుత్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా పెద్ద పెట్టున పార్టీ నాయకులు, కార్యకర్తలు నినదించారు. వైయస్‌ఆర్‌సిపి నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో రైతులు కూడా ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
Back to Top