విభజన శక్తులను తరిమికొట్టండి

పెద్దపంజాని (చిత్తూరు జిల్లా)

, 29 డిసెంబర్ 2013: రాష్ట్ర విభజన ప్రక్రియను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్న కాంగ్రెస్, టీడీపీలను రానున్న ఎన్నికల్లో తరిమికొట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకుని, మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామనే అభ్యర్థికే ప్రధాని పదవి కట్టబెడదామన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజానిలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో శ్రీ జగన్‌ మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని సోనియా గాంధీ విభజిస్తుంటే.. చంద్రబాబు నాయుడు ఆమెకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ తీరును నిలదీయాల్సిన చంద్రబాబు ఆమెతోనే కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని శ్రీ జగన్‌ అభివర్ణించారు.
రాష్ట్ర ప్రజల మనోభీష్టాలు కాంగ్రెస్, టీడీపీ నాయకులకు పట్టవని దుయ్యబట్టారు. రాష్ట్ర విడిపోతే.. రైతులు, విద్యార్థులు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నా పట్టించుకోకుండా కొన్ని ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని శ్రీ జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎంతగానో దిగజారిపోయిందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఇప్పుడు లేరన్నారు. విశ్వసనీయత అనే పదానికి అర్థాన్ని మర్చిపోయిన రాజకీయ వ్యవస్థను చూస్తున్నామన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని విచారం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో పోరాటం చేస్తున్నదని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజలు ఇచ్చే స్పష్టమైన తీర్పుతో ఢిల్లీ పునాదులను కదిలించాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు సానుకూలంగా ఉన్న నాయకుడినే ఎంపిక చేయగల స్థితిలో మనం ఉండాలన్నారు. మరో నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికల్లో 30కి పైగా ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుని ఢిల్లీ పీఠంపై ఎవరు ఉండా నిర్ణయిద్దామని అన్నారు.

వెయ్యి అడుగులు తవ్వితే గాని నీళ్ళు వస్తాయో రావో తెలియని దుస్థితి ఉందని చిత్తూరు జిల్లా రైతులు చెబుతుంటే బాధ కలిగిందని శ్రీ జగన్‌ అన్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన చంద్రబాబు రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే హంద్రీ - నీవాకు, గాలేరు - నగరికి గతిలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే గాని ఎగువ రాష్ట్రం నీటిచుక్కను మన రాష్ట్రానికి వదలని దుస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యలో మరో రాష్ట్రాన్ని పెడతామంటే సరే అని చంద్రబాబు చెప్పడం ఏమిటని ఆయన నిలదీశారు. మన రాష్ట్రం ముక్కలైపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచినీళ్ళెక్కడివని‌ పాలకులను శ్రీ జగన్ ప్రశ్నించారు.

పదేళ్ళలో హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపొమ్మంటుంటే ప్యాకేజీలడుగుతున్న చంద్రబాబు, మోసం చేస్తున్న సీఎం కిరణ్‌ చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు విభజన జరిగితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని రైతులు, ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలని యువకులు వార కాలర్‌ పట్టుకుని నిలదీయమని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు తొలి నుంచి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు సమైక్యం అనే మాట అనకపోవడం దారుణం అన్నారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోనని, సమైక్యాంధ్రకు లేఖ ఇచ్చేది లేదని ఏపీ ఎన్జీవోల విజ్ఞప్తిని నిర్దయగా తిరస్కరించిన చంద్రబాబు తీరును శ్రీ జగన్‌ తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విడగొడుతుంటే ఏ మాత్రం విచారం లేని ఈ నాయకులను చూస్తే బాధగా ఉందన్నారు. రైతులు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోని కిరణ్, చంద్రబాబు వీళ్ళా నాయకులు అని ప్రశ్నించారు.

చెన్నైలో, కర్నాటకలో ఉన్న ఉంటున్నట్లుగానే హైదరాబాద్‌లో కూడా సీమాంధ్రులు కూడా రెండవ శ్రేణి పౌరులుగా బ్రతకాలన్నదే చంద్రబాబు ఉద్దేశమా అని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. మన రాష్ట్రం మనకు ఉండాలి, మన రాజధాని నగరం మనకు ఉండాలన్నారు. ఎక్కడ చదువుకున్నా ఉద్యోగానికి హైదరాబాద్‌ వెళతానని ప్రతి యువకుడూ, యువతీ గర్వంగా చెప్పుకునేలా ఉండాలన్నారు. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని, తామంతా ఒక్కటి అనే సగర్వంగా తెలుగు ప్రజలు చెప్పుకోవాలన్నారు.

తాను అడిగే కొన్ని ప్రశ్నలకు 'నో' అని గట్టిగా సమాధానం చెప్పాలని, ఆ సమాధానాలు చంద్రబాబుకు, కిరణ్‌కు, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీకి కూడా వినిపించేలా గట్టిగా రెండు చేతులూ ఎత్తి చెప్పాలని పిలుపునిచ్చారు. 'ఈ రాష్ట్రాన్ని వాళ్ళు విడగొడతామంటే మనం ఒప్పుకుంటామా'?. 'మన తెలుగుజాతి విడగొడతామంటే మనం ఒప్పుకుందామా'?. 'మన నీటి కోసం మనమే తన్నుకు చావండి అంటే మనం ఒప్పుకుంటామా'?. 'మన హైదరాబాద్‌ను వాళ్ళు తన్నుకునిపోతామంటే ఒప్పుకుంటామా'?. 'రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియా గాంధీని, మద్దతిస్తున్న చంద్రబాబును, మోసగిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని క్షమిస్తామా?'.

'జై సమైక్యాంధ్ర', 'జై తెలుగుతల్లి', 'జై వైయస్ఆర్‌' నినాదాలతో సోనియా గాంధీ గుండె ఆగాలి, చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డి గూబ గుయ్‌మనాలి అని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.
అంతకు ముందు పలమనేరు నియోజకవర్గంలో రోజంతా చేసిన పర్యటనలో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీ జగన్‌ ఆవిష్కరించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగేళ్ళవుతున్నా ప్రజల గుండెల్లోనే కొలువై ఉన్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బత్తులపురంలోని కల్పన భర్త, పిల్లలను శ్రీ జగన్‌ ఓదార్చారు.

Back to Top