డెడ్ లైన్ @7వ తేదీ

()ముద్రగడకు ప్రతీ కాపు సోదరుడు అండగా ఉన్నాడు
()హామీ నెరవేర్చకపోతే  ఏంజరుగుతుందో కాపులు చూపిస్తారు
()అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం
()దాసరి నివాసంలో కాపు సమావేశం సందర్భంగా అంబటి వ్యాఖ్యలు

హైదరాబాద్ :కాపులకు రిజర్వేషన్లు సాధించే పోరాటంలో ముద్రగడ పద్మనాభం ఒంటరి కాదని.. ఆయన వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నారని కాపు నాయకుడు, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.  దాసరి నారాయణరావు నివాసంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర కాపు ప్రముఖులు సమావేశమయ్యారు. ఆ సమావేశం విశేషాలను అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. ముద్రగడ పద్మనాభం 14 రోజుల పాటు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన తీరు అభినందనీయమని, ఆయన్ను అమానవీయంగా అణిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేకరకాల అక్రమ మార్గాలు అన్వేషించినా, ఆయన ధైర్యంగా పోరాడి విజయం సాధించారని చెప్పారు.

సెప్టెంబర్ ఏడో తేదీలోగా కాపులను బీసీల్లో చేర్చుతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. అప్పటివరకు ఆగి 7వ తేదీ తర్వాత చేపట్టబోయే కార్యాచరణ గురించి  చర్చించినట్లు చెప్పారు. కాపులను బీసీలలో చేర్చాలన్న హామీని ప్రభుత్వం నెరవేర్చేలా చేసేందుకు ముద్రగడ పద్మనాభం సర్వసన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయనకు అండగా ఉన్నామని చెప్పేందుకే సమావేశం అయ్యామన్నారు. పద్మనాభం ఒంటరి కాదని.. ఆయన ఉద్యమం వెనుక ప్రతి కాపు సోదరుడు ఉన్నారని చెప్పారు. ఏ పార్టీలో, ఏ స్థాయిలో ఉన్నా.. అందరం కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లాలని అంతా ముక్తకంఠంతో నిర్ణయించామని తెలిపారు. ఉద్యమాన్ని నీరుగార్చాలనే చంద్రబాబు వ్యూహానికి కాపునేతలు తగిన ప్రతివ్యూహాలు రూపొందించారని, తాము ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏమీ అడగట్లేదని అన్నారు. వాటిని నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో కాపులు చూపిస్తారని హెచ్చరించారు. ఇక పవన్ కల్యాణ్ తమతో కలిసొస్తారో లేదో అనే అంశం ఆయననే అడగాలని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Back to Top