దమ్ముంటే సస్పెండ్‌ చేయండి: ఆళ్ల నాని సవాల్

ఏలూరు, 25 మార్చి 2013: అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై దమ్ముంటే సస్పెండ్‌ చేయాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని సవాల్‌ చేశారు. సస్పెండ్‌ చేసిన తరువాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పేదలకు అండగా నిలబడినందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారా? అని ఆయన నిలదీశారు. ఏలూరు మండలంలోని ఏడు గ్రామాల్లో అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఆయన స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారంనాడు 'ప్రజా నిరసన దీక్ష'ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఏలూరుకు తీరని అన్యాయం జరిగిందని స్థానిక నాని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ఉన్న సమయంలో తమ నియోజకవర్గంలో ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. మరో ఎనిమిది వేల మందికి ఇళ్ళ పట్టాల కోసం 150 ఎకరాల భూమిని సేకరించామని నాని గుర్తుచేశారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో తన నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిందని ఆళ్ల నాని విమర్శించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సిఎం స్థాయి లేదన్నారు. రచ్చబండలో ఇచ్చిన హామీలను కూడా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరచిపోయారని ఆయన అన్నారు. పేదల సమస్యలు కిరణ్‌ కుమార్‌రెడ్డికి పట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీలపై సిఎం బాధ్యతారహితంగా వ్యవహరించడం అత్యంత దారుణం అని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top