'దళిత బంధు' ఎలా అవుతారు?

వల్లభి (ఖమ్మం జిల్లా), 22 ఏప్రిల్‌ 2013: ప్రజల నుంచి ఎన్నికైన నాయకులకే జనం పట్ల ప్రేమ, ఆదరణ ఉంటాయని శ్రీమతి షర్మిల అన్నారు. ఎవరో ఖాళీ చేసిన కుర్చీ మీద కూర్చున్న కిరణ్‌ కుమార్‌రెడ్డికి దళితులు, పేదల మీద ప్రేమ ఉందంటే నమ్మడానికి ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదని ఆమె వ్యాఖ్యానించారు. 'దళిత శంఖారావం' పేరుతో రాజమండ్రిలో సభ నిర్వహించి సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి తనకు తానే 'దళిత బంధు' బిరుదు ఇచ్చేసుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దళితులకు ఎలాంటి మేలూ చేయని కిరణ్‌ 'దళిత బంధు' ఎలా అయ్యారని ఆమె ప్రశ్నించారు.

కాంగ్రెస్‌, టిడిపిల తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర 128వ రోజు సోమవారం సాయంత్రం కృష్ణా జిల్లాలో ముగించుకుని ఖమ్మం జిల్లా ప్రవేశించారు. మధిర నియోజకవర్గంలోని వల్లభిలో అడుగుపెట్టడం ద్వారా ఆమె ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా వల్లభిలో ఆమె మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వల్లభిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

మాట మీద నిలబడడం చేతకాని చంద్రబాబు అడుగుజాడల్లోనే కిరణ్‌ కుమార్‌రెడ్డి కూడా నడుస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. కిరణ్‌ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటవని ప్రజలందరికీ అర్థమైందన్నారు. మూడేళ్ళుగా ‌సిఎంగా ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డికి దళితుల పట్ల ఇంత కాలంగా లేని ప్రేమ ఈ ఆఖరి సంవత్సరంలో, ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎందుకు పుట్టుకువచ్చిందని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పడం కాదు చేతలు ముఖ్యమని కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆమె సూచించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి దళితులను ప్రేమించడమే కాకుండా వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్నో పనులు చేసి చూపించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. కానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి దళితులకు ఏమీ చేయకుండానే, తనకు తానే దళిత బాంధవుడిని అనుకుని బిరుదులు పెట్టుకుంటున్నారంటే.. నవ్వక ఏం చేస్తారు జనాలు అన్నారు. మహానేత వైయస్‌ సిఎంగా ఉన్నప్పుడు 20 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనులకు పంపిణీ చేశారన్నారు. అది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిత్రగా నిలిచిందన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. వైయస్‌ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.

చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకుని అప్పులపాలైపోయిన 18 లక్షల దళిత కుటుంబాలను రాజశేఖరరెడ్డిగారు రుణ విముక్తులను చేశారని తెలిపారు. వారి రుణాల కోసం రూ. 1,200 కోట్లు చెల్లించారని శ్రీమతి షర్మిల అన్నారు. దళిత బంధుగా బిరుదు తగిలించుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఈ మూడేళ్ళ పాలనలో దళితులకు ఏమి చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మూడేళ్ళపాటు గాడిదలను కాసి.. ఇప్పుడేమో తనకు తానే రైతు బాంధవుడినని చెప్పుకుంటున్నారంటే ఆయనకు మతి చలించిందనుకోవాలా? లేక ప్రజలను పిచ్చివాళ్ళను చేస్తున్నారనుకోవాలా? అని అన్నారు. రైతుల మీద తనకు ఏ మాత్రం ప్రేమ లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి ఈపాటికే రుజువు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. రుణాలు మాఫీ చేసే అధికారమే చంద్రబాబుకు ఉండి ఉంటే తాను పాలించిన తొమ్మిదేళ్ళలో ఎందుకు చేయలేదని నిలదీశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఇప్పుడేమో ఆయన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలనే తానూ చేస్తానంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మాట మీద నిలబడడం తెలీదన్నారు.

రక్షణ స్టీల్సులో తనకు భాగం ఉందని నిరూపిస్తే.. పాదయాత్ర మానేసి ఇంటికి వెళ్ళిపోతానని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అలా నిరూపించలేక పోతే.. చంద్రబాబు నాయుడు టిడిపికి రాజీనామా చేస్తారా? అని ఆమె బహిరంగ సవాల్‌ విసిరారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి, జగనన్న ముఖ్యమంత్రి అయితే... మహానేత రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలన్నింటికీ జీవం పోస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.
Back to Top