ధరలను అదుపుచేయడంలో వైఫల్యం..!రైతుల అవస్థలు పట్టని అసమర్థ ప్రభుత్వం..!<br/>హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సామాన్యుడు కడుపు నిండా భోంచేసే పరిస్థితి కరువైందన్నారు. ప్రభుత్వం అసమర్థత. అలసత్వం కారణంగానే ధరలు దారుణంగా పెరిగాయని ఉమ్మారెడ్డి తెలిపారు. <br/>రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఉమ్మారెడ్డి ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని దళారులకు పంచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతూ పేదల నడ్డివిరుస్తున్నారని ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే ఈపరిస్థితి వచ్చేదా అని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. <br/>ధరలు పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రంలో దగాకోరు పరిపాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయని, అక్రమ నిల్వదారులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కళ్లు మూసుకొని ఎందుకు ప్రవర్తిస్తోందని ఉమ్మారెడ్డి నిలదీశారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి ..ఎమ్మార్వోలకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.<br/>కృష్ణా ఆయకట్టు బీడు అయ్యే పరిస్థితి ఉందని తాము ముందునుంచి వారిస్తునే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఉమ్మారెడ్డి ఫైరయ్యారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటా వచ్చేలా చూడాలని కౌన్సిల్ లోనూ తాము ప్రభుత్వాన్ని నిలదీశామని ఉమ్మారెడ్డి చెప్పారు. పట్టిసీమ హామీతో లక్షలాది ఎకరాల పంట ఎండిపోవడానికి చంద్రబాబు కారణమయ్యాడని విమర్శించారు. పరిపాలన స్తంభించిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పంటలన్నీ ఎండిపోయి రైతులు విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.