భయంతోనే బాబు, బొత్స అనుచిత వ్యాఖ్యలు

చోడవరం (విశాఖ జిల్లా) :

శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమకింక పుట్టగతులుండవనే భయంతోనే బొత్స, చంద్రబాబు మహానేత వైయస్ఆర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. అసలు కాంగ్రెస్ ‌నాయకులు వైయస్‌ఆర్ బొమ్మ పెట్టుకొని ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని‌ ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్, ‌టిడిపిలు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఆయన శనివారంనాడు విలేకరులతో మాట్లాడుతూ బొత్స, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు.

పేద, మధ్య తరగతి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ తర్వాత వైయస్సే అని దాడి వీరభద్రరావు చెప్పారు. వాటికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు మద్దతు ఇస్తున్నారని వీరభద్రరావు చెప్పా రు. ఎన్నికల్లో ధనబలంపైనే కాంగ్రెస్, టిడిపిలు ఆధారపడ్డాయని, అడ్డదారిలో అయినా ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవాలని తాపత్రయ పడుతున్నాయని దుయ్యబట్టారు.

ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఎక్కువ సీట్లను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుందని దాడి వీరభద్రరావు అన్నారు. ఆంధ్ర, రాయలసీమల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు అధిక సీట్లు వస్తాయన్న భయంతోనే టిఆర్‌ఎస్‌తోనైనా కలసి తెలంగాణలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని సోనియా రాష్ర్ట విభజనకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. కానీ తెలంగాణాలో కూడా తమ పార్టీ 40 స్థానాల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమని దాడి ధీమా వ్యక్తంచేశారు.

Back to Top