హైదరాబాద్) ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్సార్సీపీ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ కు రంగం సిద్దం చేస్తోంది. ఈ దిశగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు ముఖ్య సమావేశం జరుగుతోంది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు హాజరు అవుతున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, తాగునీటి ఎద్దడి, రైతాంగ సమస్యలపై చర్చిస్తారు.సమావేశం ఉద్దేశ్యాలను ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్యలు చేపట్టకపోవడం, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోకపోవడం, మండే ఎండలకు తగినట్లుగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఒక ఉద్యమ కార్యాచరణను సమావేశంలో పార్టీ రూపొందించనున్నట్టు ఆయన వివరించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న ఇతర సమస్యలు కూడా ఈ సందర్భంగా చర్చకొస్తాయని పేర్కొన్నారు.