కాంగ్రెస్‌ పార్టీది బ్రాందేయ వాదం!

నర్సీపట్నం (విశాఖ జిల్లా),

26 జూన్‌ 2013: ఇంటిలో దొంగలు పడ్డారు.. కాపాడేందుకు పోలీసులను పంపించండంటూ పోలీసు స్టేషన్‌కు ఫోను చేస్తే.. 'ఎలాగూ దొంగలు పడ్డారు కదా వాళ్ళకే బీరువా తాళాలు ఇచ్చేసి బయటికి వెళ్ళిపొండి' అని సలహా ఇచ్చారట. రాష్ట్ర మంత్రి పార్థసారథి తీరు ఈ చందంగానే ఉందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. మద్యం షాపుల వద్ద మద్యం సేవించే వారు రోడ్డు మీద తాగకుండా ఉండేందుకే సిట్టింగ్‌రూంలకు అనుమతి ఇచ్చామని ఆయన చెప్పడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. పోలీసులను పెట్టి మద్యం దుకాణాల్లో ఎవరూ తాగకుండా చూడాల్సింది పోయి.. వారిని కాపలా పెట్టి మద్యం దుకాణాల్లోనే తాగిస్తామంటున్న వీళ్లు మన ఖర్మకొద్దీ నాయకులై కూర్చున్నారు. వీళ్లు మంత్రులు.. వీళ్లు పాలకులు.. చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రంలోని బ్రాందీ షాపులన్నీ మినీ బార్లుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులు మాత్రం కుదిస్తారట, మద్యం అమ్మకాలు రెట్టింపు చేస్తారట. కానీ, ఫీజు రీయింబర్సుమెంటు లబ్ధిదారులను తగ్గించేస్తారట’ అని శ్రీమతి షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రె‌స్ ప్రభుత్వం వైఖరిని, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ‌తీరును ఎండగడుతూ శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగింది. నర్సీపట్నంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీ నమ్ముకున్నది గాంధేయ వాదాన్ని కాదు.. బ్రాందేయ వాదాన్ని అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. అందుకే మద్యం మాఫియా డాన్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుందని విమర్శించారు. 'ఈ జూన్‌ నెలలో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. రైతన్నలకు విత్తనాలు, ఎరువులు పెద్దమొత్తంలో అవసరం. వాటిని రైతులకు అందుబాటులో ఉంచడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది. జూన్ అంటే చదువులు ప్రారంభమయ్యే నెల. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి, ఫీజు భారం తగ్గించే ప్రయత్నం చేయాల్సిన సమయమూ ఇదే. కానీ, ఈ ప్రభుత్వం ఈ విషయాల్లో పూర్తిగా విఫలమైంది. రైతులు, విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన ఈ ‌ప్రభుత్వం మద్యం విధానంపైనే పూర్తిగా దృష్టి పెట్టిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

'కొత్త మద్యం పాలసీ ప్రకారం రూ. 2 లక్షలు కడితే మద్యం దుకాణాల్లోనే తాగడానికి సిట్టింగ్ రూంలు ఇస్తారట. అంటే ఇక మీదట మద్యం దుకాణాలన్నీ మినీ బార్లుగా మారబోతున్నాయన్నమాట. జనాలను దుకాణాల్లోనే కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ తాగించాలనేది ఈ సి.ఎం. లక్ష్యం. కిరణ్ ‌ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం, మానవత్వం ఏమైనా ఉన్నాయా' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ నియోజకవర్గంలో మద్యం మత్తులో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగినా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగలేదని దుయ్యబట్టారు.

మద్యం అదుపుపై జగనన్నకు పూర్తి స్పష్టత ఉంది :
మద్యం మహమ్మారి కుటుంబాల్లో ఎలాంటి చిచ్చు పెడుతుందో జగనన్నకు బాగా తెలుసు. అది నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో, కుటుంబాలను ఎలా విడగొడుతుందో పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టే మద్యాన్ని అదుపు చేసే విషయంలో జగనన్న చాలా స్పష్టత కలిగి ఉన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే జగనన్నకు ముఖ్యం అన్నారు. ప్రజల ఆయుష్షే ప్రధానం. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం. మద్యం కారణంగా జరిగే నేరాలు, ప్రమాదాలను అరికట్టడమే ముఖ్యం. మద్యంతో చితికిపోయిన జీవితాలను మళ్లీ నిలబెట్టడమే ప్రధానం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం బాగుంటుందని నేను మాటిచ్చి చెప్తున్నాను అని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

కిరణ్‌ ప్రభుత్వంలో నీరు నిల్‌.. మద్యం ఫుల్! :
కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వలన ఎక్కడా సాగు, తాగు నీరు లేదు గాని, మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా దొరుకుతోంది. ప్రతి ఏటా వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు తగ్గినా ఫర్వాలేదు కానీ, మద్యం అమ్మకాలు మాత్రం ఏటేటా పెరగాలన్నది సిఎం కిరణ్ లక్ష్యం‌గా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం నాలుగేళ్లలోనే మద్యం అమ్మకాలను రెట్టింపు చేసుకున్నారు. ఇక మీదట రాష్ట్రం మూడు పర్మిట్ రూంలు, ఆరు బార్లుగా వర్ధిల్లుతుందన్నమాట‌ అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

బెల్టుషాపులు పెట్టిందే చంద్రబాబు :
బెల్టుషాపులకు ఆద్యుడు చంద్రబాబు అని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఇలాంటి నాయకుడు అలాంటి మాటలు కాకపోతే ఎలాంటివి మాట్లాడతారు? మంచినీళ్లు వద్దు.. మద్యమే ముద్దు అని పాలక, ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు. ఆ నాయకుల చేతిలో పడి ఇవాళ మన రాష్ర్టం అతలాకుతలం అవుతోంది. ఈయన ప్రతిపక్ష నాయకుడు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు అడిగితే లాఠీలతో కొట్టించిన ఘనత ఆయనదని చెప్పారు. చంద్రబాబు అవినీతి చరిత్రను శ్రీమతి షర్మిల ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణాల మాఫీ కాదు కదా కనీసం ఆ రుణాల మీద వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథాకాలు అమలు చేస్తానన్నప్పుడు మహానేత వైయస్‌ను అవహేళన చేసిన చంద్రబాబు ఈ రోజు తానూ అవే పథకాలను అమలు చేస్తానంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం 16 లక్షల మందికి పింఛను ఇస్తే, వైయస్‌ఆర్ 71 లక్షల మందికి ఇచ్చారని తెలిపారు. అనారోగ్యంతో ఎవరూ ఇబ్బంది పడకూడదని వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని అన్నారు.

కిరణ్‌ పాలనలో అన్నీ బంద్‌! :
తాండవ రిజర్వాయర్‌ మరమ్మతులకు మహానేత వైయస్ నిధులు మంజూరు చేశారని శ్రీమతి షర్మిల చెప్పారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా వైయస్‌ చేస్తే.. మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేని ఈ ప్రభుత్వం మద్యం ప్రవాహానికి మాత్రం గేట్లు ఎత్తేసిందని దుయ్యబట్టారు. ప్రజలకు మనశ్శాంతి బంద్‌. కిరణ్‌ పాలనలో అభివృద్ధి బంద్‌ అయిపోయిందన్నారు. రాష్ట్రంలోని సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వైయస్‌ హయాంలో ఏ ఒక్క చార్జీని పెంచలేదని గుర్తుచేశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటే ఉంటే తమ రెండు దుకాణాలూ మూసేసుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు తెలుసని, అందుకే కుట్ర చేసి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలులో పెట్టించారన్నారు. ఒక రోజు త్వరలోనే వస్తుంది.. జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మనందర్నీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని చెప్పారు. రాజన్న కలలన్నింటినీ జగనన్న నెరవేరుస్తారని హామీ ఇచ్చారు.

మరి కొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు, ఇంకొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయని శ్రీమతి షర్మిల తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్‌, టిడిపిలకు గట్టిగా బుద్ధి చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీన అభ్యర్థులను బలపరిచి గెలిపించినప్పుడు రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. ఈ బహిరంగ సభకు వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు.

Back to Top