ఇక ఉద్యమం ఉద్ధృతం: చెవిరెడ్డి

చిత్తూరు: షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు తొలగించిన 355 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని చంద్రగిరి ఎమ్మెల్యే,షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ పాలకవర్గం చర్యలను నిరసిస్తూ 24 రోజులుగా దీక్ష, ఆందోళనలు చేస్తున్న కార్మికులు బుధవారం ఉదయం ఫ్యాక్టరీ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కార్మికులకు మద్దతుగా ఆయన కొద్దిసేపు దీక్షలో కూర్చున్నారు. కార్మికుల పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్మికులనుద్దేశించి చెవిరెడ్డి మాట్లాడుతూ 13 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వని పాలకవర్గం 355 మంది కార్మికులను రాత్రికిరాత్రే తొలగించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇటు కార్మికులు, అటు రైతుల కడుపులు కొట్టి చక్కెర ఫ్యాక్టరీని మూసివేయాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు.
Back to Top