చట్టాల్లో లొసుగులవల్లే మహిళలపై అత్యాచారాలు


ఆళ్ళగడ్డ (కర్నూలు జిల్లా), 23 డిసెంబర్ 2012:

దేశంలో మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. దేశ రాజధానిలోనే యువతులకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 48 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నట్టు నివేదికలు చెపుతున్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు లోపభూయిష్టమైన చట్టాలే కారణమన్నారు. వీటి మీద చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు.

     దేశ జనాభాలో 50 శాతం మహిళలే ఉన్నారని, అలాగే అత్యున్నత పదవుల్లో మహిళలే కొనసాగుతున్నా అత్యాచారాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శోభానాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభలో అనేక చట్టాలు రూపొందించారని, రాజ్యాంగ సవరణలు కూడా చేశారన్నారు. కానీ మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలను అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.

     మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 376 క్లాజ్ (1) కింద ఏడు సంవత్సరాలు, అదే మైనర్ బాలికలు, గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులకు ఐపీసీ సెక్షన్ 376 క్లాజ్ (2) కింద 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడుతుందన్నారు. కానీ ఈ శిక్షలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయని అన్నారు. నిందితులు పది రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి యథేచ్చగా తిరుగుతున్నారన్నారు. చట్టాల్లో ఉన్నలొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు రెచ్చిపోతున్నారని అన్నారు.

     యువతులపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ఈ శిక్షలంటే భయం లేకుండా పోయిందన్నారు. దేశ రాజధానిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలు, శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనగానీ, జరుగుతున్న సంఘటనలను గానీ రాజకీయ కోణంలో చూడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం రోజుల పాటు హడావుడి చేసి, ఆ తర్వాత చేతులు ఎత్తేయడం కాకుండా నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందించాలని శోభానాగిరెడ్డి సూచించారు.

Back to Top