చంద్రబాబు పాలన మాయని మచ్చ

కళ్యాణదుర్గం (అనంతపురం జిల్లా),

16 ఏప్రిల్ 2014 : తొమ్మిదేళ్ళ చంద్రబాబు నాయుడి హయాం రాష్ట్ర రాజకీయాలకు, పరిపాలనకు మాయని మచ్చ‌లా మిగిలిందని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఇలాంటి మరచిపోవడానికి వీలు లేని భయంకరమైన గతం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అబద్ధపు హామీలతో ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తున్నారని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు. విశ్వసనీయత, వ్యక్తిత్వం, ప్రజలకు మేలు చేయాలన్న మనసు లేని చంద్రబాబు లాంటి నాయకులను ప్రజలు తిరస్కరించాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బుధవారం నిర్వహించిన 'వైయస్ఆర్‌ జనభేరి' ఎన్నికల ప్రచార సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో సైతం అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

విద్యార్థులు, రైతులు, పింఛన్‌దారులు, మహిళలకు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని తన తొమ్మిదేళ్ళ పాలనలో అమలు చేయడానికి కట్టుబడలేదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తూర్పారపట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతటి హామీనైనా ఎలాంటి హామీలనైనా ఇచ్చేస్తారని, ఎన్నికల తరువాత వాటిని మర్చిపోతారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు, అమలు చేయడానికి వీలులేని హామీలనే చంద్రబాబు ఈ సారి కూడా ఇస్తున్నారని శ్రీ జగన్‌ ఆరోపించారు.

అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడబోరని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలను చులకనగా చూశారని, ఆయన వ్యవహార శైలితో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రస్తావించారు. విశ్వసనీయత, హుందాతనం అనే మాటలకు చంద్రబాబు డిక్షనరీలో స్థానంలేదని శ్రీ జగన్‌ విమర్శించారు.  చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు తమ పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ప్రజల గుండెల్లో మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌ఒక్కరే చిరస్మర‌ణీయుడిగా ఉన్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మహానేత వైయస్ఆర్‌ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే ఆయనను ప్రజలు తమ హృదయాల్లో నిలుపుకునేలా చేశాయన్నారు. ఆ మహానేత పథకాలే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్ఫూర్తిదాయకం అని, తమను అవే ముందుకు నడిపిస్తున్నాయని, నిజమైన వారసుడిగా తాను ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. వైయస్ఆర్ అధికారంలోకి వ‌చ్చిన తరువాత తాము ఉన్నత చదువులు అభ్యసిస్తున్నామని నిరుపేద విద్యార్థులు గర్వంగా చెప్పారన్నారు.

అయితే.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నా చంద్రబాబు నాయుడిలో ఇప్పటికీ మార్పు రాలేదని శ్రీ జగన్‌ అన్నారు. 'ఎన్నికల తర్వాత తాను ఉండడు... తన పార్టీ కూడా ఉండదనే విషయం చంద్రబాబుకు తెలుసునని' అయినా అధికారం కోసం ఆయన ఎంతటి అబద్ధమైనా చెబుతారని శ్రీ జగన్ అన్నారు.

మరో 25 రోజుల్లో వస్తున్న ఎన్నిక్లలో మనం వేసే ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని శ్రీ వైయస్ జగ‌న్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ నేత పేదవాడి గుండెచప్పుడు వింటారో వారికే మద్దతు పలకండని ఆయన కోరారు. మళ్లీ‌ తాను అధికారంలోకి రావాలన్న కోరికతో చంద్రబాబు నాయుడు పట్టపగలే అబద్ధాలు ఆడుతున్నారని శ్రీ జగన్ మండిపడ్డారు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. అమ్మకు అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడిలా తాను అబద్ధాలు ఆడనని, ఆయనలా అమలు కాని హామీలు ఇవ్వడం తనకు తెలియదని శ్రీ జగన్‌ చెప్పారు. తనకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతే అన్నారు. పేదలెవరైనా ప్రమాదానికి గురై చికిత్స పొందిన తరువాత బెడ్ రె‌స్టు తీసుకోవాలని డాక్టర్ చెబితే ఉపాధి లేని ఆ వ్యక్తికి ఆరోగ్యశ్రీ కింద మూడు వేలు ఇస్తామని శ్రీ జగన్ ‌భరోసా ఇచ్చారు. సొంత తమ్ముడి ఉద్యోంగం కోసం ఎలా కష్టపడతానో అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాల కోసం కృషి చేస్తానని శ్రీ జగన్ ‌తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే పథకాలు, కార్యక్రమాల గురించి శ్రీ జగన్‌ సవివరంగా ఈ సభలో ప్రస్తావించారు.

Back to Top